‘నారాయణ’లో చదువుకోలేను..
– రెండు నెలలుగా మొండికేసిన ప్రణయ్‌రెడ్డి
– ఫీజులు చెల్లించాం.. అక్కడే చదువుకోవాలంటూ తల్లిదండ్రులు బుజ్జగింపు
– గత నెలలో తిరుపతికి పారిపోయి కొంతకాలం హోటల్‌లో పని
– తండ్రి కోరిక మేరకు తిరిగొచ్చి చదువు కొనసాగింపు
– ఒత్తిడి తట్టుకోలేక రైలు కింద పడి బలవన్మరణం
కర్నూలు:
ఒత్తిడితో చదువుకోలేక ఓ విద్యార్థి గురువారం ఆనంద్ థియేటర్ సమీపంలోని హంద్రీ బ్రిడ్జిపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలులో సంచలనం రేపింది. దేవనగర్ సమీపంలోని విఠల్ నగర్‌లో హంద్రీ నది ఒడ్డున ఉన్న ప్రగతి అపార్ట్‌మెంట్‌లో దేవేందర్‌రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు సంతానం. దేవేందర్‌రెడ్డి దొడ్ల పాలడైరీలో మేనేజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు ప్రణయ్‌రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా కుమార్తె జీపిక 1వ తరగతి చదువుతోంది. ప్రణయ్‌రెడ్డి(16) నగరంలోని ఆర్‌ఎంకే ప్లాజా క్యాంపస్‌లో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
గురువారం ఉదయం ఇంటి నుంచి సైకిల్‌పై కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి మధ్యాహ్నం రైలు పట్టాలపై శవమై తేలాడు. బ్రిడ్జి ప్రక్కన పుస్తకాల సంచి, టిఫిన్ బాక్సు, కొద్ది దూరంలో సెల్‌ఫోన్ ఉంచి రైలు కింద పడటంతో తల, మొండెం వేర్వేరు అయ్యాయి. రైలు ట్రాక్‌పై మతదేహం ఉన్నట్లు గ్యాంగ్‌మెన్ కనుగొని స్టేషన్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన ఆదేశాల మేరకు రైల్వే ఎస్‌ఐ జగన్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించాడు. పుస్తకాల్లో ఉన్న అడ్రస్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
చదువుకోవడం ఇష్టం లేకనే బలవన్మరణం : తండ్రి దేవేందర్‌రెడ్డి
చదువుకోవడం ఇష్టం లేకనే తన కుమారుడు రైలు కిండ పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి దేవేందర్‌రెడ్డి రైల్వే పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నారాయణ కళాశాలలో చదువుకోలేను.. మరో కాలేజీలో చేర్పించండి.. అక్కడ ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాను అని మొండికేశాడు. గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలోని ఓ హోటల్‌లో కొంతకాలం పనిచేశాడు. పట్టుకొచ్చి మళ్లీ కాలేజీకి పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మౌనంగా ఉండేవాడని, చదువుకోవాలని చెబితే తమనే కసురుకునేవాడని తెలిపారు. ప్రణయ్‌రెడ్డి కళాశాలకు రాలేదంటూ ఫోన్ చేసి యాజమాన్యం సమాచారం అందిన వెంటనే కుమారునికి ఫోన్ చేస్తే బయట ఉన్నానని చెప్పాడని, గంట వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులను సమాచారం అందిందన్నారు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి సాయంత్రం వరకు కోమాలోకి వెళ్లారు. వారికి ఆసుపత్రిలో వైద్యచికిత్సలు చేయించారు. కోలుకున్న అనంతరం రైల్వే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్‌ఐ జగన్ విచారణ జరిపారు. తండ్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
మార్చురీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన...
ప్రణయ్‌రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిన వెంటనే ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు శ్రీనివాసులు, మహేంద్ర, ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడు మోహన్ ఆధ్వర్యంలో మార్చురీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విద్యార్థి మతికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడితో ప్రణయ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తుండగా పది మంది ఏఐఎస్‌ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి సాయంత్రం సొంత పూచీకత్తుపై వదిలేశారు.