ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
Published Fri, Dec 16 2016 2:28 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
ఏలూరు అర్బన్ : ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు టూటౌన్ పరిధిలోని 37వ డివిజన్ చేపలతూము సెంటర్‌లో ఎం.వెంకటసుబ్బారావు కోడిమాంసం వ్యాపారం చేసుకుంటూ భార్య రాణి, కూతురు జ్యోతిక (17), కుమారుడు రవితో జీవనం సాగిస్తున్నాడు. పిల్లలిద్దరినీ కార్పొరేట్ కళాశాలల్లో చదివి స్తున్నారు. నగరంలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న జ్యోతిక అనారోగ్యంగా ఉందంటూ మూడు రోజులుగా కాలేజీకి సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కుట్టు పని నేర్చుకోవడానికి బయటకు వెళ్లిన తల్లి రాణి కొద్దిసేపటికి ఇంటికి రాగా జ్యోతిక ఆత్మహత్య చేసుకోవడం చూసి ఘెల్లుమంటూ కేకలు వేసింది. విషయం తెలిసిన తండ్రి వెంకట్రావు హుటాహుటిన ఇంటికి వచ్చి జ్యోతికను కిందకు దించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు జ్యోతిక అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.
వేధింపులే బలితీసుకున్నాయి
తన కుమార్తె ప్రాణాలను కాలేజీ యాజమాన్యం వేధింపులే బలిగొన్నాయని తండ్రి వెంకటరావు ఆరోపిస్తున్నారు. జ్యోతిక చదువులో చురుకుగా ఉండేదని, అయితే కొద్దిరోజులుగా అధ్యాపకులు తరచూ తోటి విద్యార్థుల ముందు తనను అవమానిస్తున్నారని జ్యోతిక తనవద్ద వాపోయిందన్నారు. ఇదే విషయం తాను కళాశాల యాజమాన్యంతో మాట్లాడగా అలాంటిదేమీ లేదని ప్రిన్సిపాల్ చెప్పడంతో జ్యోతికను తాను మందలించానని వాపోయారు. దీంతో మనస్తాపానికి గురైన జ్యోతిక ఆత్మహత్య చేసుకుందని విలపించారు.
కన్నీరుమున్నీరై..
చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుని కుటుంబానికి ఆసరాగా ఉం టుందనుకుంటే ఇలా అఘాయిత్యం చేసుకుందని జ్యోతిక తల్లి, తమ్ముడు ఆసుపత్రి వద్ద బోరుమన్నారు. అచేతనంగా పడిఉన్న జ్యోతికను చూసి తల్లి, తమ్ముడు రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
Advertisement
Advertisement