
పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
చేవెళ్లః అనాదిగా వివక్షకు గురవుతున్న మాదిగలకు రాజ్యాంగపరమైన హక్కుల సాధనకోసం వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. వచ్చేనెల 8,9,10 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమ సన్నాహాక సమావేశాన్ని జిల్లా స్థాయిలో చేవెళ్లలోని అతిథిగృహంలో ఆదివారం తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు జోగు అశోక్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిడమర్తి రవి మాట్లాడుతూ...రాజ్యాంగ పరంగా తమకు ఎన్నో హక్కులు సంక్రమించాల్సి ఉన్నప్పటికీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కాకపోవడంతో తాము అన్ని విధాలా అన్యాయాలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటంచేసిన మాదిగనేతలకు చిత్తశుద్ధిలేదని మందక్రిష్ణమాదిగను ఉద్ధేశించి పేర్కొన్నారు. ఆయన హాయాంలో మాదిగలకు సాధించిపెట్టిందేమీలేదని విమర్శించారు. తమ ఉధ్యమమంతా మాలలపై కాదని తమ హక్కులను తాము కాపాడుకునేందుకు, పరిరక్షించుకునేందుకని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు రావాల్సిన ఉద్యోగాలు రావడంలేదన్నారు. దీంతో తాము వర్గీకరణ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సమాజంలోని మేధావులంతా సహకరించి మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో విషయాలపై పోరాటం చేస్తున్న కోదండరాం ఎస్సీ వర్గీకరణపై తమ వైఖరిని స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారు. ఏనాడూ ఆయన ఎస్సీ వర్గీకరణ బిల్లుకోసం మాట్లాడలేదని, దీనిపై తాము తీవ్రం అసంతృప్తితో ఉన్నామని చెప్పారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ వచ్చేనెల ఢిల్లీ యాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు జోగు అశోక్‌కుమార్ మాట్లాడుతూ పిడమర్తి రవి నాయకత్వంలో తాము వర్గీకరణ సాధించడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీర్ఘకాలంగా ఉధ్యమం చేస్తున్నా సాధించిందేమీలేదన్నారు. మాదిగలంతా ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణ సాధించుకునేవరకు పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ యువజన జేఏసీ చైర్మన్ పెరికె కరణ్‌జయరాజ్, రాష్ట్ర విద్యార్థి జేఏసీ చైర్మన్ గజ్జెల అంజిబాబు, గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షులు చిరుమూర్తి రాజు, తదితరులు పాల్గొన్నారు.