
హరితహారానికి ఇరాన్ కాన్సులెట్ ప్రశంసలు
అనంతపద్మనాభ స్వామి సన్నిధిలో కాన్సులెట్ జనరల్ నౌరియన్ కుటుంబసభ్యులు
వికారాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం చాలా బాగుందని ఇరాన్ కాన్సులేట్ జనరల హాసన్ నౌరియన్ ప్రశంసించారు. రెండు రోజుల పాటు అనంతగిరిలో కుటుంబసమేతంగా గడిపేందుకు వచ్చిన ఆయన హరిత రిస్టార్స్‌లో బస చేశారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హరితహారం చేపట్టడం మంచి పరిణామమని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ మంచి పాలన దీక్షుడని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా పేరుతో లక్షలాది కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇరాన్‌కు భారతీయులకు మధ్య బేధాలు పెద్దగా ఉండవన్నారు. ఇరాన్ రాయబార కార్యాలయాలు దేశంలో మూడు ప్రాంతాల్లో ఉన్నాయని ఇవి ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక, సాంస్కృతిక సహకారాన్ని ఎప్పటికప్పుడు అందించుకుంటూ పనిచేస్తాయని తెలిపారు. నరేంద్రమోదీ ఇరాన్ వచ్చినప్పుడు తమ దేశం ఘన స్వాగతం పలికిందని, ఇరాన్ ప్రధాని ఇక్కడి కూడా వచ్చారని గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంకా మెరుగయ్యాయని తెలిపారు. ఇరాన్‌లో తొంబై శాతానికి పైగా ముస్లింలే ఉంటారని చెప్పారు. భారతదేశంలో వివిధ రకాల భాషలు, కులాలు, సంస్కృతుల ఉన్నా ఐకమత్యంగా ఉంటారని తెలిపారు.