- బదిలీ చేసినా విధుల్లో చేరని ఉద్యోగులు
- సంవత్సర కాలంగా పొందుతున్న వేతనాలు
- వర్కర్ల జీతాల్లో అధికారులకు వాటాలు
- అంతా ఓకే అంటున్న డీడీ...
- ఇదీ దళిత సంక్షేమ శాఖ పరిస్థితి
‘సంక్షేమం’లో అక్రమాలు !
Published Mon, Aug 29 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
హన్మకొండ అర్బన్ : అక్రమాలకు పాల్పడితే ఎలాగైనా సంపాదింవచ్చనడానికి జిల్లా సాఘిక సంక్షేమ శాఖ ఉదాహరణగా నిలిచింది. ఈ శాఖలో అధికారుల చేయి తడిపితే.. కిందిస్థాయి వార్డెన్లు ఆడింది ఆట... పాడింది పాట అన్నట్లుగా ఉంది వ్యవహారం. జిల్లాలోని కొన్ని హాస్టళ్లలో గత ఏడాదిన్నరగా పని చేయకున్నా వర్కర్లకు వేతనాలు ఇస్తున్నారు. ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి ఉన్నతాధికారులు ముందుగానే నెలకు రూ.ఐదు వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వార్డెన్ల విషయంలోనూ ఇదే తంతు. అయితే ఉన్నతాధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదని, ఆంతా ఓకే అని చెప్పడం గమనార్హం.
పిల్లలు లేక మూతపడిన హాస్టళ్లు..
సాంఘిక సంక్షేమ శాఖ స్టేషన్‌ఘన్‌పూర్ ఏఎస్‌డబ్ల్యూఓ పరిధిలోని తాటికొండ, మల్కాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్, వేలేరు, ధర్మసాగర్ హాస్టళ్లను పిల్లలు లేరనే కారణంతో గత విద్యాసంవత్సరం మూసివేశారు. ఆయా హాస్లళ్లలో ఒక్కో వార్డెన్, ముగ్గురు వర్కర్ల చొప్పున ఉన్నారు. వీరందరినీ ఖాళీ ఉన్న ప్రాంతాల్లో సర్దుబాటు చేశారు. వాచ్‌మెన్లను మాత్రం మూసేసిన హాస్టళ్లకు రక్షణగా ఉంచి మిగతా వారిని ఇతర ప్రదేశాలకు బదిలీ చేశారు. ఇక్కడే కథ మొదలైంది.. దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో వారు విధుల్లో చేరలేదు. అయితే నెల వచ్చే సరికి జీతాల సమస్య ఏర్పడడంతో వార్డెన్లు, వర్కర్లు కలిసి ఒక అవగాహనకు వచ్చారు. కొత్త స్థానాల్లో చేరకుండానే ప్రతినెలా వేతనాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో వర్కర్ నుంచి వార్డెన్లు నెలకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారని, ఇందులో కొంత మెుత్తం ఉన్నతాధికారులకు సైతం అందుతోందని సమాచారం. ఇలా పనిచేయకుండానే మూడు హాస్టళ్లలోని ఆరుగురు వర్కర్లు ఏడాదిన్నరగా వేతనాలు తీసుకుంటున్నారు.
వార్డెన్లదీ అదే పరిస్థితి...
స్టేషన్‌ఘన్‌పూర్ ఏఎస్‌డబ్ల్యూఓ పరిధిలో మూతపడిన మల్కాపూర్, వేలేరు, ధర్మసాగర్ హాస్టళ్ల వార్డెన్లు ఖాళీగానే ఉంటున్నా ఇంతకాలం కూర్చోబెట్టి వేతనాలు ఇచ్చారు. ఇంకా ఎక్కువ కాలం అలాగే చెల్లిస్తే బాగుండదనుకున్నారో ఏమో.. నగరంలో ఇటీవలే ఏర్పాటు చేసిన కాలేజీయేట్ హాస్టళ్లలో వారికి బాధ్యతలు అప్పగించారు. ఇక స్టేషన్‌ఘన్‌పూర్‌లో మూసేసిన ఎస్సీ హాస్టల్ వార్డెన్‌దీ ఇదే పరిస్థితి. ఈయనను కూడా నగరంలోని ఓ హాస్టల్‌లో కేటాయించారు. నవాబ్‌పేట వార్డెన్‌కు ఇంతకాలం ఏపనీ లేకున్నా బీసీ సంక్షేమ శాఖ హాస్టల్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్నారని చూపిస్తూ ఎస్సీ సంక్షేమ శాఖ వేతనం ఇస్తోంది. తాజాగా ఆయనకు కూడా నగరంలో ఒక కాలేజీ హాస్టల్ అప్పగించారు.
వాటాల్లో తేడాలతో వెలుగులోకి..
వర్కర్లు పని చేయకుండానే వేతనం తీసుకున్న సమయంలో ఉన్నతాధికారులకు అందులో వాటా అందింది. తాజాగా వేతనాల్లో వాటా విషంయలో వర్కర్లు, అధికారులకు మధ్య తేడాలు రావడంతో వ్యవహారం ఓ మధ్యవర్తి వద్దకు చేరింది. ఈ దందా మొత్తం బయట పడితే అసలుకే ఎసరొస్తుందని భావించిన అధికారులు.. ఆంతా కలిసి ఓ అంగీకారానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గత శుక్రవారం కలెక్టరేట్‌లోని శాఖ కార్యాలయంలో అధికారుల సమక్షంలో పంచాయితీ తీర్మానం చేసుకోవాలనుకున్నారు. అయితే అంతలోనే అధికారికి, వర్కర్లకు మధ్య నెలవారీ చెల్లింపుల విషయంలో గొడవ తీవ్రం కావడంతో విషయం రచ్చకెక్కింది.
ఎక్కడివారు అక్కడే పనిచేస్తున్నారు
– అంకం శంకర్, ఎస్సీ వెల్ఫేర్ డీడీ
స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని కొన్ని హాస్టళ్లు గత సంవత్సరం మూతపడ్డాయి. వాటిలో పనిచేసే వర్కర్లను వెంటనే ఇతర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నచోటకు సర్దుబాటు చేశాం. వారంతా కొత్త ప్రదేశాల్లో చక్కగా పనిచేస్తున్నారు. ఒకరిద్దరు చేరకపోతే మెమోలు కూడా ఇచ్చినట్లు గుర్తుంది. ప్రస్తుతం ఆంతా బాగానే ఉంది.
Advertisement
Advertisement