సమావేశంలో సజ్జల, నాగార్జున తదితరులు
సాక్షి, అమరావతి: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దళితులకు సంక్షేమ పథకాల అమలుపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిగింది. పార్టీ ఎస్సీ విభాగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునేలా చైతన్యం చేయడంపై చర్చించారు. దళితుల్లో నాయకత్వాన్ని పెంపొందించేలా చురుకైన కార్యకర్తలు, నేతలను గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించారు.
సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న మేలు, చేకూరుతున్న ప్రయోజనాలను వివరిస్తూ త్వరలో రాష్ట్రస్థాయి ఎస్సీ సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు.
దళితులను మోసగించేందుకు టీడీపీ పన్నుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ సూచించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. ఎస్సీ విభాగానికి సంబంధించి అన్ని కమిటీలను బలోపేతం చేస్తామని సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను జగనన్న సందేశం పేరుతో ఇంటింటికీ తీసుకు వెళ్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment