'అనంత'లో ఉగ్రవాదుల కీలక పత్రాలు లభ్యం
అనంతపురం: గత వారం హైదరాబాద్ లో కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు, భద్రతా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. తాజాగా అనంతపురంలో ఐసిస్ ఉగ్రవాదుల కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. బస్టాండ్ సమీపంలోని నంది రెసిడెన్సిలో సోదాలు నిర్వహించి లాడ్జి నుంచి ఉగ్రవాదుల ఐడీ ప్రూఫ్స్, లాగ్ ఇన్ రిజిస్టర్, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లో అరెస్టయిన ఐసిస్ సానుభూతిపరులను అనంతపురం పట్టణానికి తీసుకొచ్చి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తుపాకీ కొనుగోలు చేసేందుకు ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు ఇక్కడికి వచ్చారని వివరించారు. హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది అనుమానిత ఉగ్రవాదులను జూన్ 29న ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.