విద్యుత్ దీపాలతో వెలుగులీనుతున్న ఇస్కాన్
నేటి నుంచి ‘ఇస్కాన్’జూబ్లీ ఉత్సవాలు
Published Wed, Aug 24 2016 4:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
– ‘మహా సంబరం’గా శ్రీకృష్ణ జన్మాష్టమి
– తిరుపతి, ముంబయి, ఢిల్లీ, బృందావనం, బెంగళూరుల్లో భారీ ఏర్పాట్లు
– 25న అన్ని చోట్లా మహా శంఖాభిషేకం, ఉట్టి ఉత్సవాలు
– దేశమంతటా కోటి మంది భక్తులకు అన్నదానం
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను జూబ్లీ మహోత్సవాలుగా నిర్వహించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ ఏడాది మహా సంబరాలుగా నిర్వహించేందుకు ఇస్కాన్ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి దేశ విదేశాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి, ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, బృందావనం ఆలయాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక, అన్నప్రసాద వితరణ, మహాశంఖాభిషేకాలను కూడా నిర్వహించేందుకు సమాయత్తమైంది. అన్నిచోట్లా సుమారు కోటి మంది భక్తులకు అన్నప్రసాద వితరణకు సిద్ధమైంది.
దేశ, విదే«శాల్లోని ఇస్కాన్ ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఏటా అత్యంత భారీగా నిర్వహిస్తుంటారు. ఇందుకోసం అంతర్జాతీయ కృష్ణ చైతన్యం సంఘం కోట్లల్లో నిధులు వెచ్చిస్తుంది. ఏటా కృష్ణ జన్మాష్టమి పర్వదినాన మనదేశంలోని ఇస్కాన్ ఆలయాలకు సుమారు కోటి మందికి పైగా భక్తులు హాజరై స్వామివారిని దర్శిస్తుంటారు. ఈ ఏడాది దేశ విదేశాల్లో ఉన్న 400 పైగా ఇస్కాన్ మందిరాల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఉత్సవ నిర్వహణ కమిటీ మాత్రం ప్రధాన ఆలయాలైన తిరుపతి, ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, బృందావనం ఆలయాలపై దృష్టి పెట్టింది. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగే వీలున్నందున వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేశ విదేశాల నుంచి కోటి మందికి పైగా కృష్ణభక్తులు స్వామివారిని దర్శించే అవకాశముందని అంచనాకు వచ్చిన నిర్వాహకులు దర్శనం, ప్రసాద వితరణ, అన్నదానం వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన బృందావనంలో జరిగే వేడుకలను తిలకించేందుకు 12 దేశాల నుంచి భక్తులు విచ్చేయనున్నారు. ఇక్కడ జరిగే వేడుకలను జర్మనీకి చెందిన సనక్ సనాతన్‌దాస్ పర్యవేక్షిస్తున్నారు.
ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ ఆలయానికి ఒక్కరోజే 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకుల అంచనా. ఇక్కడ జరిగే వేడుకలను ఇస్కాన్ ప్రతినిధి బ్రిజ బిహారీదాస్ పర్యవేక్షిస్తున్నారు. ఇకపోతే ఢిల్లీలోని ఈస్ట్ కైలాస్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ మందిరంలో 3 రోజుల పాటు గోపాలకృష్ణుడి వేడుకలు జరగనున్నాయి. గోపాలకృష్ణ ప్రభు ఆధ్వర్యంలో ఆలయ ఉత్సవాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తిరుపతిలో జరిగే వేడుకలను ఇస్కాన్ చైర్మన్ రేవతీ రమణదాస్, వైస్ చైర్మన్ రూపేష్‌ప్రభులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు ఆలయానికి విచ్చేసే వీలుందని రూపేష్‌ప్రభు పేర్కొన్నారు. బెంగళూరులోని హరేకృష్ణ హిల్స్ దగ్గరున్న ఇస్కాన్ ఆలయంలో మధుపల్లి దాస్ ప్రభు పర్యవేక్షణలో మూడు రోజుల పాటు బ్రహ్మాత్సవాలు జరుగనున్నాయి.
ఉత్సవాల సందర్భంగా తిరుపతి, ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, బృందావనం ఆలయాలను రంగు రంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కోటి మందికి సరిపడా 18 టన్నుల స్వీట్ పొంగల్‌ను తయారు చేయిస్తున్నారు. ఆలయాల్లోని స్వామి వారి విగ్రహాలను 108 రకాల ఫలఫుష్పాలతో అలంకరిస్తున్నారు. 25న సాయంత్రం 3 గంటలకు ఉట్టికొట్టే వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి ఆలయ మండపాల్లో పెద్ద ఎత్తున మహా శంఖాభిషేక మహోత్సవాలను నిర్వహించనున్నారు.
Advertisement