తీరంలో మొక్కల బాధ్యత మత్స్యకారులదే: కలెక్టర్
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో పొడవైన సముద్ర తీరం ఉందని, అయితే సరైన వనరులు లేకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో అపార నష్టం వాటిల్లుతోందని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తీర ప్రాంత పంచాయతీల సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. మడ అడవుల పెంపకంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. నీటి యాజమాన్య సంస్థ, అటవీ శాఖలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయని, తీర గ్రామాల సహకారం కావాలని కోరారు. సరుగుడు, తాటిచెట్లు పెంచాలన్నారు. ఈ నెల 30నాటికి పెద్ద ఎత్తున తీరంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సర్పంచ్‌లకు సూచించారు. తీరంలో రెండు చోట్ల ఫిషింగ్ హార్బర్లను నిమించడానికి అనువైన పరిస్థితులను అధ్యయనం చేశామని వివరించారు.
ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. మత్య్సకారులకు మరబోట్లు, వలలు, ఆధునిక పరికరాలు అందజేస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి మాట్లాడుతూ మత్య్సకార గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సర్పంచ్‌లు, అధికారులు అమలు చేయాలన్నారు. సమావేశంలో నీటియాజమాన్యసంస్థ ప్రాజక్టు డైరక్టరు ఆర్ కూర్మనాథ్ తోపాటు డీఎఫ్‌ఓ శాంతిస్వరూప్, సామాజిక అటవీశాఖాధికారి లోహితాస్యుడు, జడ్పీ సిఇఓ బి నగేష్, మత్య్సశాఖ డీడీ డాక్టర్ వీవీ కృష్ణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి జి కోటీశ్వరరావు, సెట్‌శ్రీ సీఈఓ మూర్తి తదితరులు హాజరయ్యారు.