సాక్షి, అమరావతి: సులభతర సరుకు రవాణా వ్యవస్థలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వరంగ డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)–2022 ర్యాంకుల్లో రాష్ట్రం మరోసారి సత్తాను చాటింది. లీడ్స్–2022 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల విభాగాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు అచీవర్స్‌గా నిలిచాయి. ఫాస్ట్ మూవర్స్ విభాగంలో కేరళ ఉండగా, ఏస్పైర్స్ విభాగంలో గోవా, పశ్చిమబెంగాల్ ఉన్నాయి.
తీరప్రాంతం లేని రాష్ట్రాలు, తీరప్రాంతం ఉన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల కింద నాలుగు విభాగాలుగా విభజించి అచీవర్స్, ఫాస్ట్‌మూవర్స్, ఏస్పైర్స్ ర్యాంకులను ప్రకటించారు. సర్వేలో 90 శాతానికిపైగా పాయింట్లు సాధించిన రాష్ట్రాలను అచీవర్స్‌గా, 80 నుంచి 90 శాతం మధ్య ఉన్న వాటిని ఫాస్ట్‌మూవర్స్‌గా, 80 శాతం కంటే తక్కువ పాయింట్లు పొందిన రాష్ట్రాలను ఏస్పైర్స్‌గా ప్రకటించారు. తీరప్రాంతం లేని రాష్ట్రాల విభాగాల్లో హరియాణ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నాయి.
దేశవ్యాప్తంగా సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలను తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. 2030 నాటికి దేశ ఎగుమతులు రెండు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా 2018 నుంచి లీడ్స్ ర్యాంకులను ప్రకటించడం మొదలుపెట్టింది. 2021 లీడ్స్ ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొదటిస్థానంలో నిలిచింది.
సింగిల్ డెస్క్‌తో సత్ఫలితాలు
లీడ్స్–2022లో అత్యధిక పాయింట్లతో మొదటిస్థానం రావడంలో స్పందన కీలకపాత్ర పోషించినట్లు నివేదికలో పేర్కొన్నారు. పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి ఇండస్ట్రీస్ స్పందన పేరుతో ఏర్పాటు చేసిన సింగిల్ డెస్క్ పోర్టల్ సత్ఫలితాలను ఇస్తోంది. రవాణా మౌలికవసతుల్లో గోడౌన్లు మినహాయించి మిగిలిన అన్నీ సగటుకంటే ఎక్కువ మార్కులు పొందినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సులభతర సరుకు రవాణా కోసం పోర్టులు, పారిశ్రామికపార్కుల వద్ద ట్రక్ పార్కింగ్ టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. నెల్లూరు, గంగవరం, అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment