అది నయీమ్‌ డెన్‌ | It"s nayeem den | Sakshi
Sakshi News home page

అది నయీమ్‌ డెన్‌

Published Sat, Aug 13 2016 10:47 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

ఇంటిని పరిశీలించిన డీఎస్పీ భూక్యా రాంరెడ్డి, సీఐ చేరాలు తదితరులు - Sakshi

ఇంటిని పరిశీలించిన డీఎస్పీ భూక్యా రాంరెడ్డి, సీఐ చేరాలు తదితరులు

  •  2008–2011  మధ్యలో ఇక్కడికి నయీమ్, ఫయీం..?
  •  ఇంటిని పరిశీలించిన వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి
  •  సిట్‌కు సమాచారం అందించామని వెల్లడి

  • సాక్షిప్రతినిధి, ఖమ్మం:
    పక్కాగా అది నయీమ్‌ డెన్‌.. ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత ఏసీలు,  ఖరీదైన బెడ్‌లు, ప్రతి రూమ్‌కు అటాచ్డ్‌ బాత్‌రూమ్‌.. కింద పాలరాతి బండలు.. ఆ ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత సుల్తానాబేగం మాయం. ఆ తర్వాత ఇవన్నీ తొలగించడం.. మళ్లీ 2014లో బీబమ్మ ప్రత్యక్షం. ఇంట్లో ఉంటున్న రహీం కుటుంబీకులకు మీరే ఉండాలని చెప్పడం.. ఇదంతా చూస్తే.. నయీమ్‌ ఐదేళ్ల క్రితం గాంధీనగర్‌ కాలనీలోని ఇంటిని డెన్‌గా ఉపయోగించుకున్నట్లు అర్థమవుతోంది. మిర్యాలగూడలో వారం రోజుల క్రితం అరెస్ట్‌ అయిన నయిమ్‌ అత్తే ఇక్కడి సుల్తానా అని పోలీసులు, నిఘా విభాగాలు పసిగట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా నయీమ్‌ ఇక్కడ డెన్‌ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఏంచేశాడనే దానిపై నిఘా వర్గాలు లోతుగా శోధిస్తుండగా.. దీనిపై ఇప్పటి వరకు ఉన్న సమాచారం సిట్‌కు కూడా పంపినట్లు తెలిసింది.
    డెన్‌కు పలుమార్లు నయీమ్‌..
    ఖమ్మం నగరానికి సమీపంలోని విజయవాడ వెళ్లే రాష్ట్రీయ రహదారి పక్కన ఉన్న గాంధీనగర్‌ కాలనీలో డెన్‌ కోసమే నయీమ్‌ ఇంటిని కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఇక్కడ డెన్‌ ఏర్పాటు చేసుకుంటే.. ఇటు హైదరాబాద్‌కు, అటు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే సమయంలో సేఫ్‌జోన్‌గా ఉపయోగపడుతుందని భావించినట్లు సమాచారం. అందుకే ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా కేవలం అతను వచ్చి వెళ్లేలా షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకున్నాడా..? లేక ఇక్కడ కూడా ఏమైనా సెటిల్‌మెంట్లు చేశాడా..? అని నిఘా విభాగాలు లోతుగా పరిశీలిస్తున్నాయి. అయితే 2008–2011 మధ్యలో నయీమ్‌ తన సోదరుడు ఫయీమ్‌ మరికొంతమంది అనుచరులు పలుమార్లు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇల్లు కొనుగోలు, ఆంజనేయస్వామి దేవాలయానికి విరాళం ఇచ్చిన బీబమ్మ అలియాస్‌ సుల్తానాబేగం నయీమ్‌ అత్తనే అని ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న వారు చెప్పే వివరాలను బట్టి స్పష్టమవుతోంది.
    రెండేళ్ల తర్వాత గాంధీనగర్‌ కాలనీకి బీబమ్మ..
    2011లో బీబమ్మ ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ ఇంటిని ఖమ్మం కోర్టులో బెంచ్‌ క్లర్కుగా పనిచేసే రహీంకు అద్దెకు ఇచ్చింది. అయితే తన తండ్రి రహీమ్‌కు బీబమ్మ మేనత్త అవుతుందని వైరా డీఎస్పీ ఆ ఇంటిని పరిశీలించినప్పుడు రహీమ్‌ కుమారుడు పోలీసులకు వివరించాడు. 2011లో వెళ్లిన బీబమ్మ 2014లో ఒకసారి ఇంటికి వచ్చి.. ఇంట్లో మీరే ఉంటున్నారా..? ఇంటిని సరిగా చూసుకోవాలని, ఇంట్లో మీరే ఉండాలని చెప్పి.. పది నిమిషాల్లోనే వచ్చిన కారులో వెళ్లిపోయిందని రహీం భార్య కూడా చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారం రోజుల క్రితం మిర్యాలగూడలో నయీమ్‌ అత్త సుల్తానాతోపాటు అతని బావమరుదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా 400 పత్రాలను, ఓ పిస్తోలును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల్లో గాంధీనగర్‌ కాలనీ ఇంటి ఒప్పంద పత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. రహీం ఆ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నాడు. ఇంకా ఎవరెవరు వచ్చేవారని పోలీసు నిఘా విభాగాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
    బంగారు నగలతో ఖరీదైన కార్లలో..
    గాంధీనగర్‌ కాలనీలో సుమారు 600 కుటుంబాల వరకు ఉన్నా.. ఆ ఇంటికే ఖరీదైన కార్లలో.. బంగారు ఆభరణాలు ధరించిన మహిళలు వచ్చేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఎవరితో మాట్లాడేవారు కాదని, ఇంట్లోనే రెండు,మూడు రోజులు ఉండి.. వెళ్లిపోయే వారని, ఆ తర్వాత బీబమ్మే కనిపించేదని, ఆమె కూడా ఎవరితో పెద్దగా ముచ్చటించేది కాదని చెబుతున్నారు. ఆంజనేయస్వామి దేవాలయానికి భారీగా విరాళం ఇవ్వడంతో అక్కడ ప్రార్థనామందిరం కడుతున్న మరో వర్గం వారు విరాళం ఇవ్వాలని బీబమ్మతోపాటు అక్కడికి వచ్చిన కొందరిని అడిగినా.. స్పందించలేదని చెబుతుండటంతో ఇక్కడకు వచ్చింది నయీమ్, ఫయీమ్‌ అయి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
    ఆ ఇంటి సమీపంలోనే మరో ప్లాట్‌..
    నయీమ్‌ తన తల్లిదండ్రుల పేరుతో కొనుగోలు చేసిన ఇంటి సమీపంలోనే మరో ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంట్లో కూడా ఇల్లు నిర్మించాలని బీబమ్మ అనుకున్నట్లు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతేకాకుండా బీబమ్మకు దగ్గరగా ఉండే ఓ మహిళకు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చినట్లు కాలనీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదైనా సహాయ సహకారాల కోసం బీబమ్మను కలవాలంటే ముందుగా ఆ మహిళను కలిసి చెబితే.. ఆమె బీబమ్మకు తెలిపేదని.. ఆమె చెప్పిన సమాధానాన్ని మళ్లీ వీరికి చేరవేసేదని చెబుతున్నారు.
    ప్రకాశంను ఆరాతీసిన ఇంటెలిజెన్స్‌..
    ఈ ఇంటిని విక్రయించిన నేలకొండపల్లి మండలం చెరువుమాదారం వీఆర్‌ఏ ప్రకాశంను ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇల్లు ఎప్పుడు విక్రయించారు..? ఎందుకు విక్రయించారు..? కొనుగోలు చేసినప్పుడు ఎంతమంది వచ్చారు..? ఎక్కడినుంచి వచ్చారు..? తదితర అంశాలను ప్రకాశంను అడిగినట్లు సమాచారం. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని, ఫోన్‌ ఎత్తాలని, గ్రామంలోనే ఉండాలని సూచించారు.
    సిట్‌కు ‘సాక్షి’ కథనం..
    నయీమ్‌ అత్త సుల్తానాబేగం గాంధీనగర్‌ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసిందని.. ఇక్కడికి నయీమ్, అతని అనుచరులు పలుమార్లు వచ్చి ఉంటారన్న అనుమానాలను వ్యక్తంచేస్తూ ‘సాక్షి’లో ‘నయీమ్‌ నీడ’ పేరుతో వచ్చిన కథనాన్ని జిల్లా పోలీస్‌ అధికారులు సిట్‌కు పంపించినట్లు సమాచారం. ఈ కథనం ఆధారంగానే అతి త్వరలో సిట్‌ బృందం సభ్యులు ఇక్కడికి రానున్నట్లు తెలుస్తోంది. ‘సాక్షి’లో వచ్చిన వివరాలు.. వాస్తవ పరిస్థితులపై ఏఎస్పీ సాయికృష్ణ, వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి, సీఐ వి.చేరాలు సమావేశమై సమీక్షించారు.
    అనుమానం ఉంది..
    డీఎస్పీ భూక్యా రాంరెడ్డి
    గాంధీనగర్‌ కాలనీలో నయీమ్‌ ఇంటిని కొనుగోలు చేశాడనే వార్తలతో వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి వైరా సీఐ చేరాలు శనివారం మధ్యాహ్నం ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రహీం కుమారులను మీ నాన్న ఎక్కడికి వెళ్లాడు..?ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు..? సుల్తానాబేగం ఏమవుతుందని ప్రశ్నించారు. డీఎస్పీ ప్రశ్నలకు.. రహీం కుమారుడు.. సుల్తానాబేగం తన తండ్రికి మేనత్త అవుతుందని, ఆమె చాలాకాలంగా ఇక్కడకు రావడం లేదన్నారు. ఇంటిపైన ఖాళీగా ఉన్న గదులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నయీమ్‌ తల్లిదండ్రుల పేరుతో ఇల్లు కొనుగోలు, దేవాలయానికి విరాళం ఇవ్వడం, సుల్తానాబేగం మిర్యాలగూడకు చెందిన వారు కావడంతో నయీమ్‌ ఆనవాళ్లపై అనుమానం ఉందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ విషయాన్ని ఇప్పటికే పోలీస్‌ ఉన్నతాధికారులకు వివరించామని, సిట్‌కు కూడా తెలిపామని చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement