మరో నయీంను సృష్టిస్తారా?
డేట్‌లైన్ హైదరాబాద్
నక్సలైట్‌లను చంపాక, పౌర హక్కుల వాళ్ల మీద, పోలీసులూ, రాజకీయ నాయకుల మీదా పడ్డాడు నయీం. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వ్యవస్థలను సృష్టించిన ఘనత మన ప్రభుత్వాలది, పోలీసు పెద్దలదే. నయీంలను సృష్టించి, ఏకు మేకు అయ్యే దాకా చూసి, మట్టుబెట్టడం ఎందుకు? ఈ ప్రశ్న మన పోలీసు పెద్దలు వేసుకోవాలి. మాకే సంబంధమూ లేదని కొట్టిపారేయొచ్చు. కానీ ఫియర్ వికాస్ నుంచి గ్రీన్‌టైగర్‌ల దాకా గత 30 ఏళ్లుగా పోలీసు పెద్దల మద్దతుతోనే నయీంలాంటి వాళ్లు బలపడి సమాజాన్ని పీడిస్తున్నారు.
గ్రేహౌండ్స్ అనే ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటుకు వ్యూహకర్తయైన కేఎస్ వ్యాస్‌ను హత్య చేసిన అప్పటి నక్సలైట్ నయీముద్దీన్ 23 ఏళ్ల తరువాత అదే గ్రేహౌండ్స్ చేతుల్లో మొన్న హతం అయ్యాడు. ప్రజలకూ, పౌరహక్కుల కార్యకర్తలకూ, తీవ్రవాద ఉద్యమానికీ తలనొప్పిగా మారిన నయీం లాంటి వారు తమకు కూడా తలనొప్పి తెప్పిస్తుంటే తప్ప మన ప్రభుత్వాలు వారిని ఈ లోకం నుంచి తప్పించవు. అందుకు నయీం ఒక్కడే కాదు చాలా ఉదాహరణలున్నాయి.
ఉపయోగపడతాడు అనుకుంటే, వాడు ఎంత కరడుగట్టిన నేరస్తుడయినా రక్షణ వలయం ఏర్పాటు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా చిద్విలాసంగా చూస్తుం టారు. అక్రమంగా ఆస్తులూ, లెక్కలేనంత డబ్బు కూడగట్టుకోడానికి అనుమ తించడమే కాదు తమవంతు సాయం కూడా చేస్తుంటారు. ఒక పోలీసు అధికారిని హత్య చేసిన నేరానికి జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు నయీం వేలాది కోట్ల ఆస్తులను సంపాదించడానికి వెనక చాలా కథ ఉంది.
నక్సలైట్ల అణచివేతకు అష్టావక్ర మార్గం
ఈ దేశంలో తీవ్రవాద ఉద్యమాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తూ వచ్చిన ప్రభుత్వాలు ఆ ఉద్యమాన్ని అదే పద్ధతిలో అణచివేయబోయి సాధ్యం కాక ఎన్నో వక్ర మార్గాలను ఎంచుకున్నాయి. ఆ ఉద్యమాల సైద్ధాం తిక పునాది ఎంత బలంగా ఉంది, ప్రజలపట్ల వారి నిబద్ధత ఎంత అనేవి ఇక్కడ చర్చనీయాంశాలు కావు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి విధుల్లోకి వచ్చే వ్యవస్థలు ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ఎంచుకున్న వక్రమార్గా లను గురించి మాట్లాడాలి.
ఆ వక్రమార్గాలలోకెల్లా మరీ అష్టావక్ర మార్గం కోవర్ట్‌లు. కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, బయ్యపు సమ్మిరెడ్డి, సోమల నాయక్, గోవింద రెడ్డి, నయీం వంటి వాళ్లంతా ఈ వక్రబుద్ధికి పుట్టిన కుక్క మూతి పిందెలే. ఒక దశలో తీవ్రవాద ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న వీళ్లంతా ఆ తరువాత పోలీసుల చేతిలో పావులుగా మారి ఆ ఉద్యమకారు లను చంపడం, చంపడానికి సహకరించడంతో మొదలుపెట్టారు.
ఆ తదుపరి పౌర హక్కుల నేతలనూ, కార్యకర్తలను మట్టుబెట్టడం, ప్రజలను హింసిం చడం, దౌర్జన్యాలు సాగించడంతో ఆగక రాజకీయ నాయకత్వాన్ని కూడా గుప్పిట పెట్టుకోడానికి వారు చెయ్యని ప్రయత్నం లేదు. నయీం కూడా అట్లా పెరిగిన వాడే. ఎందరో పోలీసు అధికారులు, మరెందరో రాజకీయ నాయకులూ నయీంతో స్నేహం చెయ్యడానికి తహతహలాడిన వారే. నయీం ఇచ్చిన నజరానాలను సంతోషంగా స్వీకరించిన వారే. సోమవారం నయీంను ఎన్‌కౌంటర్‌లో చంపేసిన తరువాత పోలీసుల సోదాల్లో చాలా విషయాలు బయటపడే ఆస్కారం గల డాక్యుమెంట్‌లు బోలెడు దొరికాయి. అవన్నిటినీ బహిరంగపరిస్తే సమాజంలోని చాలామంది పెద్ద మనుషుల బతుకులు బజారునపడటం ఖాయం. అందులో పోలీసులు, రాజకీయ నాయకులూ, వ్యాపారులూ ఇంకా ఎవరయినా ఉండొచ్చు.
భస్మాసుర హస్తం సృష్టికర్తలు
1993 జనవరిలో హైదరాబాద్ ఫతెహ్ మైదాన్ స్టేడియంలో ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను హతమార్చిన తరువాత జైలుకు వెళ్ళిన నయీం... ఏడేళ్ల తరువాత పోలీసుల ఆశీస్సులతో బయటికి వచ్చి అదే స్టేడియం పక్కన ఉన్న బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పత్రికా గోష్టి నిర్వహించి తాను ఎవరెవరిని చంపబోతు న్నాడో హిట్ లిస్ట్ చదివి వినిపించాడు. తీవ్రవాద ఉద్యమాన్ని అంతం చేస్తాననీ, అవసరం అయితే ఆనాటి పీపుల్స్‌వార్ కేంద్ర కార్యదర్శి గణపతిని కూడా హతమారుస్తాననీ ప్రకటించాడు.
ఆనాటి పోలీసు బాస్‌లకు ఇది నచ్చింది. నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేసే పనిని నయీం వంటి వాళ్లకు అప్పగించి తాము నిశ్చింతగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఇటువంటి వారు చివరికి తమ పాలిటి భస్మాసుర హస్తాలు అయ్యే ప్రమాదం ఉందని చెపితే విన్నారా? ‘‘ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని చిలక పలుకులు పలికే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మపన్నాలు వల్లించే పోలీ సులు, ప్రభుత్వ నేతలూ గమనించవలసిన విషయం ఒకటుంది.
రేపు వీళ్లు (నయీం తదితరులు) నక్సలైట్‌లను చంపుతారు సరే తరువాత ఏమిటి? ఇలాంటి నేర ప్రపంచాన్ని పెంచి పోషిస్తున్న పోలీసులకూ ప్రభుత్వానికీ అది భస్మాసుర హస్తంగా మారకుండా ఎవరరుునా ఆపగలరా?’’అని ప్రజాతంత్ర వారపత్రికలో ( 2000 ఆగస్ట్‌లో) రాస్తే పోలీసు పెద్దలకు రుచించలేదు. ఒక పోలీసు అధికారిని నా దగ్గరకు పంపించి ‘‘మీకు అటువంటి సందేహం అక్కర లేదు. ఎక్కడికి పోతారు వీళ్లు, మా అవసరం తీరాక వీళ్లను అడ్డు తొలగించుకోవడం మా చేతిలో పని, అయినా నయీం దుర్మార్గుడు, వాడితో ఎందుకు పెట్టుకుంటారు అని నాకు ఒక ఉచిత సలహా కూడా చెప్పించారు.
బెడిసి కొట్టే వరకు పోలీసు పహారా
పదహారేళ్ల నాటి నా ప్రశ్నకు నయీం చేసిన దుర్మార్గాలే పెద్ద సమాధానం. నక్సలైట్‌లను చంపాక, పౌర హక్కుల వాళ్ల మీద, ఆ తరువాత పోలీసులూ, రాజకీయ నాయకుల మీదా పడ్డాడు నయీం. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వ్యవస్థలను కొన్నిటిని సృష్టించిన ఘనత కచ్చితంగా మన ప్రభుత్వా లది, పోలీసు పెద్దలదే. హత్యా నేరాలు మోస్తున్న కత్తుల సమ్మయ్యకు పాస్‌పోర్ట్, వీసాలూ ఇప్పించి దేశం దాటించ చూస్తే అతను కొలంబోలో విమాన ప్రమాదంలో చనిపోయాడు. లేకపోతే విదేశాల్లో ఎక్కడో హాయిగా స్థిరపడి ఉండేవాడు. అనుమానంతో అమాయకులను వేధించి ఒక్కోసారి వాళ్ల జీవితాలు నాశనం కావడానికి కూడా కారణం అయ్యే పోలీసులు కత్తుల సమ్మయ్య వంటి కరడుకట్టిన నేరస్తులను క్షేమంగా దేశం దాటించేస్తారు. ఎందుకంటే అతను నక్సలైట్‌లను చంపాడు.
బయ్యపు సమ్మిరెడ్డి అనే మరో కోవర్ట్ సొంత గొడవల్లో హత్యకు గురయ్యాడు. గోవిందరెడ్డి, జడల నాగరాజు ఏమయ్యారు? చాలా కాలం జడల నాగరాజు కూడా మన పోలీసు పెద్దల ముద్దుల అతిథే. ఒకసారి సిద్ధిపేట దాబాల దగ్గర నిలబడి చాయ్ తాగుతుంటే ఆరు జీపుల నిండా సాయుధులు హైదరాబాద్ వైపు దూసుకు పోతూ కనిపించారు. ఎవరని ఆరా తీస్తే వాళ్లంతా మాజీ నక్సలైట్ జడల నాగరాజు సెక్యూరిటీ అని తెలిసింది. ముందు జీపులో ఉన్న అతనికి రక్షణగా ఈ బలగాలు. వారిలో కొందరు మఫ్టీలోని పోలీసులు. అవును మరి, నక్సలైట్‌ల శత్రువులను కాపాడటం మన పోలీసు వ్యవస్థ పనే కదా.
నేరస్త ముఠాల కోసం లెక్కలు లేని నిధులు
నయీముద్దీన్ వంటి నేరస్తుల జీవితాలకు ముగింపు ఇంతకంటే భిన్నంగా ఉండదు. అరుుతే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నయీంలను, కత్తుల సమ్మయ్య లనూ మనమే సృష్టించి, ఏకు మేకు అయ్యే దాకా చూసి, మనమే ఎందుకు మట్టుబెట్టడం? అని. ఈ ప్రశ్న మన పోలీసు పెద్దలు వేసుకోవాలి. మాకే సంబంధమూ లేదు, ఇదంతా గిట్టని వాళ్లు, పోలీసు వ్యతిరేకులూ, అభివృద్ధి నిరోధకులూ చేసే ఆరోపణ అని ప్రభుత్వం, పోలీసులు కొట్టి పారేయొచ్చు. 1986లో ఫియర్ వికాస్ నుంచి ఈనాటి గ్రీన్‌టైగర్‌ల దాకా ఈ 30 ఏళ్లలో పోలీసు పెద్దల ప్రత్యక్ష, పరోక్ష మద్దతుతోనే నయీం లాంటి వాళ్లు బలవం తులై సమాజాన్ని పీడిస్తున్నారు. వాళ్లు నక్సలైట్‌లను వ్యతిరేకిస్తారు, చంపు తారు కాబట్టి వాళ్లకు మా మద్దతు అన్నది పోలీసుల ధోరణి.
1986లో నాటి కరీంనగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన పత్రికా గోష్టిలో నాటి ఎస్‌పీ అశోక్ ప్రసాద్ సమక్షంలోనే ఫియర్ వికాస్ నాయకుడు, హుస్నాబాద్ వాస్తవ్యుడు అన్నెబోయిన మల్లయ్య ఆ సంస్థ ఆవిర్భావాన్ని, దాని లక్ష్యాలను వివరించాడు. అక్కడి నుంచి మొదలై జన రక్షణ సంస్థ, క్రాంతి సేన, గ్రీన్ టైగర్స్, రెడ్ టైగర్స్ వంటి అనేక సంస్థలు పోలీసుల ఆశీర్వాదంతోనే పుట్టాయి, ప్రజల ఆగ్రహానికి అంతరించాయి. ఇట్లాంటి వ్యక్తులు, సంస్థలను చేరదీసి, బలోపేతం చెయ్యడానికి లెక్కకురాని పోలీసు ఎస్‌ఆర్ అమౌంట్ కోట్లలో ఉంటుందట. ఎస్పీల అధీనంలో ఉండే ఆ నిధు లకు ఆడిటింగ్ వంటి చట్టపరమైన నిబంధనలు వర్తించవనీ చెబుతుంటారు.
దాదాపు ఒకటిన్నర దశాబ్దంపాటు నయీం తన దుర్మార్గాలను కొన సాగించడానికి, యథేచ్ఛగా జనాన్ని హింసించడానికి తోడ్పడిన ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొందరు పదవీ విరమణ చేశారు, కొందరు రాష్ట్ర విభజన అనంతరం అవతల రాష్ట్రానికి వెళ్లారు. కొంతకాలంగా నయీం ఆట ముగియనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడయితే అధికార పక్షానికే చెందిన కొనపురి రాములును హత్య చేశాడో, ఎప్పుడయితే అధికార పక్షానికే చెందిన కొందరు ప్రజా ప్రతినిధులను వారి వారి నియోజకవర్గాలకు వెళ్ల కుండా నిలువరించాడో, ఎప్పుడయితే వారి నుంచి సైతం కోట్లాది రూపా యలు డిమాండ్ చేశాడో అప్పుడే నయీం కథ ముగియబోతున్నదని అర్థ మైంది. సోమవారం అదే జరిగింది. మంచిదే కానీ, మరో నయీం పుట్టడన్న, పుట్టించబోమన్న హామీ మన పోలీసు పెద్దలు ఇవ్వగలరా?
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com