వంట మనిషి కాదు.. నయీమ్ నీడ | Ruling and Opposition leaders of Telangana slug it out over Nayeem | Sakshi
Sakshi News home page

వంట మనిషి కాదు.. నయీమ్ నీడ

Published Fri, Aug 12 2016 2:15 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

వంట మనిషి కాదు.. నయీమ్ నీడ - Sakshi

వంట మనిషి కాదు.. నయీమ్ నీడ

* ఫర్హానాకు తెలియకుండా చిల్లిగవ్వ కూడా లావాదేవీ జరిగేది కాదు
* గోవాలోని నయీమ్ గెస్ట్‌హౌస్ కూడా ఫర్హానా పేరిటే రిజిస్ట్రేషన్
* కోకోనట్ అని ఫర్హానాను ముద్దుగా పిలుచుకునే గ్యాంగ్‌స్టర్
* పోలీసుల విచారణలో వెల్లడించిన వాచ్‌మన్ తాజుద్దీన్

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. నెక్నాంపూర్‌లోని అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీం ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నానని చెప్పిన ఫర్హానా(30) సాధారణ మహిళ కాదట. నయీం ప్రతి కదలిక వెనుకా ఆమె పాత్ర ఉందట.

ఇంట్లో పనులు మాత్రమే చేస్తానని చెప్పిన ఈమె పేరు మీద గోవా పాండా ఠాణా పరిధిలోని పొండబొరిన్ ప్లాట్ నంబర్ 274లోని నయీం గెస్ట్‌హౌస్‌గా చెప్పుకుంటున్న ఇల్లు రిజిస్టరై ఉందని వెల్లడైంది. నార్సింగ్ పోలీసులకు పట్టుబడిన గోవాలో నయీం గెస్ట్‌హౌస్‌లో వాచ్‌మన్ తాజుద్దీన్ పోలీసు విచారణలో ఈ విషయాన్ని బయటపెట్టడు. దీంతో ఆమె పాత్రపై లోతుగా అధ్యయనం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి వాచ్‌మన్‌గా పనిచేస్తున్న తాజుద్దీన్.. గోవాలో నయీం నేర కార్యకలాపాలు బాగానే జరుగుతుండేవని పోలీసులకు తెలిపాడు. పుప్పాలగూడ పంచాయతీ పరిధిలోని అంజలిగార్డెన్‌లోనూ ఫర్హానాకు ఏడాది క్రితం నయీమ్ ఇల్లు కొనిచ్చాడని తెలిసింది. రెండు రోజుల క్రితమే ఈ ఇంట్లో పోలీసులు సోదాలు చేసి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
 
వినోదం, లావాదేవీలకు అడ్డాగా..
భార్య హసీనా బేగమ్‌తో ఆడపాదడపా నయీమ్ గోవాకు వెళ్లేవాడు. అయితే ఎక్కువసార్లు ఫర్హానాతోనే వెళుతుండేవాడు. అలాగే సదా, కరీనా, జేబ, ఇతర అమ్మాయిలనూ అక్కడకు తీసుకెళ్లేవాడు. గోవా నుంచే డబ్బు లావాదేవీలు భారీ మొత్తంలో సాగేవి. భూ సెటిల్‌మెంట్లకు సంబంధించిన విషయాల మీద కూడా భారీగానే చర్చించేవారు. చాలా మంది అమ్మాయిలతో నయీమ్ గెస్ట్‌హౌస్‌లో ఎంజాయ్ చేసేవాడు. ఫర్హానాను నయీమ్ ముద్దుగా కోకొనట్ అని పిలిచేవాడు.

నయీమ్ ప్రతి ఆర్థిక లావాదేవీనీ ఈమె పర్యవేక్షిస్తుండేది. నయీమ్ ఆదేశాల ప్రకారం కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకుని తాజుద్దీన్ నయీంకు అందజేసేవాడు. నయీమ్ ఉపయోగించే ఫోన్‌లు, సిమ్‌లు బాక్స్‌లో పెట్టుకునేవాడు. తన రూమ్, ఏఏ గదుల్లో డబ్బులు ఉంచాననే సీక్రెట్ లాంగ్వేజ్‌తో ఓ మ్యాప్‌ను రెడీ చేసి హాల్‌లో అంటించిపెట్టేవాడు. గోవాకు వచ్చినప్పుడల్లా పల్సర్ టీవీఎస్ స్కూటీ పెప్  బైక్‌లపై చక్కర్లు కొట్టేవాడు. గోవాలోని నయీం బెడ్‌రూమ్‌లో డబ్బు, భూ డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులు భద్రపరుచుకునేవాడు. అయితే ఇటీవల గోవాలోనే చర్చ్‌కు సమీపంలోని చర్చ్‌హౌస్‌గా పిలిచే మరో ఇంటిని నయీమ్ కొనుగోలు చేశాడు. అయితే ఏపీ, తెలంగాణలోని భూ దందాలకు సంబంధించిన సెటిల్‌మెంట్లను అక్కడి నుంచి చేసేవాడని తెలుస్తోంది.
 
ఎవరీ తాజుద్దీన్..?
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని అబ్బాసియా కాలనీ మహమ్మద్ తాజుద్దీన్ స్వస్థలం. తాజుద్దీన్ పసితనంలోనే సూర్యాపేటలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన తండ్రి కన్నుమూశాడు. ఆ తర్వాత నల్లగొండలోని తాత ఇంటికి అతని కుటుంబం వెళ్లింది. అక్కడే పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత పంక్చర్ షాప్ మొదలెట్టాడు. 1990లో మిర్యాలగూడకు చెందిన మహమ్మద్ బేగమ్‌ను పెళ్లాడాడు. తర్వాత హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌కు మకాం మార్చాడు. కొన్నిరోజులు ఇక్కడా పంక్చర్ దుకాణం నిర్వహించి గిట్టుబాటు కాక తుక్కుగూడలోని ఓ కంపెనీలో వాచ్‌మన్‌గా చేరాడు.

నల్లగొండకు చెందిన అఫ్రోజ్‌తో కూతురు బేగమ్‌కు పెళ్లి చేసే సమయంలో కొంత మంది నుంచి అప్పు తెచ్చాడు. ఈ సమయంలో దూరపు బంధువు నయీమ్‌ను కలసి డబ్బులు సర్దాలని కోరాడు. రూ.30 వేల అప్పు ఇచ్చిన నయీం.. గోవాలోని తన గెస్ట్ హౌస్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేయాలని కోరాడు. ఇందుకు నెలవారీగా జీతం ఇస్తానన్నాడు. దీంతో చంపాపేటలోని అత్తమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులను ఉంచి తాజుద్దీన్ 2012లో గోవాకు వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడ తాజుద్దీన్ పనిచేస్తున్నాడు.
 
ఇలా పట్టుబడ్డాడు..
పోలీసులు నయీమ్‌ను ఎన్‌కౌంటర్ చేశారని తెలియడంతో భయపడిన తాజుద్దీన్ జీఏ-07-కే-0756 మహేంద్ర బొలెరో వాహనంలో నయీమ్ బెడ్‌రూమ్‌లో నగదుతో ఉన్న ఓ బ్యాగ్ తీసుకుని, ఈ నెల 11న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పుప్పలగూడ చేరుకున్నాడు. గోవా నంబర్ ప్లేట్ గల వాహనం వస్తోందని పోలీసులకు సమాచారం అందగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో తాజుద్దీన్ పట్టుబడ్డాడు. అతడిని విచారించగా అన్ని లావాదేవీల్లో ఫర్హానా(ఏ1)ది కీలక పాత్ర అని, గోవా గెస్ట్‌హౌస్ ఆమె పేరు మీదనే ఉందని తెలిపాడని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ కేసు డైరీలో పేర్కొన్నారు. తాజుద్దీన్ నుంచి రూ.4,30,000 నగదు, మహేంద్ర బొలెరో వెహికల్, కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించింది.
 
నయీమ్ అల్లుడా మజాకా..
నయీమే కాదు భూ దందాల్లో వారి బంధువులూ ఉన్నట్టు తెలుస్తోంది. రోజురోజుకీ సెటిల్‌మెంట్ల లిస్టు పెరుగుతుండటంతో ఆ బాధ్యతల్ని తనకు నమ్మకమైన బంధువులకు అప్పగించే కార్యక్రమాన్ని నయీమ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో ఎక్కువగా నయీమ్ అల్లుడు ఫహీం భూదందాలు సెటిల్ చేస్తున్నాడు. చాలా మంది అనుచరులు ఇతని కిందే పనిచేశారు. హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో శ్రీధర్‌గౌడ్ ఇంటిని ఫయీం సెటిల్‌మెంట్లకు ఉపయోగించుకునేవాడు. ఫయీం వద్ద శ్రీధర్ గౌడ్, సుధాకర్, వెంకటేష్, శ్రీధర్‌రాజు, కరుణాకర్, శ్రీను, బలరాం అనుచరులుగా పనిచేసేవారు.

వీరంతా నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్‌లోని పాఠశాలలో కలసి చదువుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఫహీం వల్ల కానీపని అయితేనే నయీం రంగంలోకి దిగేవాడని పోలీసుల విచారణలో శ్రీధర్‌గౌడ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే శ్రీధర్, బలరాంను హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చిన వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఏ1గా నయీం, ఏ2గా ఫహీం, ఏ3గా శ్రీధర్‌గౌడ్, ఏ4గా సుధాకర్, ఏ5 వెంకటేష్, ఏ6 శ్రీధర్‌రాజు, ఏ7 కరుణాకర్, ఏ8 శ్రీను, ఏ9 బలరాంగా పేర్కొన్నారు. శ్రీధర్, బలరామ్‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పరారీలో ఉన్న ఆరుగురి గురించి ముమ్మరంగా గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement