కోర్టులో లొంగిపోయిన ఫహీం
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం బావమరిది ఫహీం, అతడి భార్య షహీమ్ శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. వారిద్దరికీ న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఫహీం పేరు మీద కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఫహీం ఏ2గా ఉన్నాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఫహీం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలి కాలంలో ఎక్కువగా నయీమ్ తరఫున ఫహీం భూదందాలు సెటిల్ చేస్తున్నాడు. చాలా మంది అనుచరులు ఇతని కిందే పనిచేశారు. అయితే నయీం అక్రమాల చిట్టా వివరాలు తనకేమీ తెలియదని ఫహీం చెప్పడం గమనార్హం. మరోవైపు ఫహీంను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది.
కాగా హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో శ్రీధర్‌గౌడ్ ఇంటిని ఫహీం సెటిల్‌మెంట్లకు ఉపయోగించుకునేవాడు. ఫహీం వద్ద శ్రీధర్ గౌడ్, సుధాకర్, వెంకటేష్, శ్రీధర్‌రాజు, కరుణాకర్, శ్రీను, బలరాం అనుచరులుగా పనిచేసేవారు. వీరంతా నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్‌లోని పాఠశాలలో కలసి చదువుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఫహీం వల్ల కానీపని అయితేనే నయీం రంగంలోకి దిగేవాడని పోలీసుల విచారణలో శ్రీధర్‌గౌడ్ వెల్లడించినట్టు తెలుస్తోంది.
శ్రీధర్, బలరాంను నిన్న హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చిన వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఏ1గా నయీం, ఏ2గా ఫహీం, ఏ3గా శ్రీధర్‌గౌడ్, ఏ4గా సుధాకర్, ఏ5 వెంకటేష్, ఏ6 శ్రీధర్‌రాజు, ఏ7 కరుణాకర్, ఏ8 శ్రీను, ఏ9 బలరాంగా పేర్కొన్నారు. శ్రీధర్, బలరామ్‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.