నయీం గురించి వంటమనిషి ఏం చెప్పిందంటే..
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం చేసిన నేరాలను అతని దగ్గర వంటమనిషిగా పనిచేసిన ఫర్హానా (30) పోలీసుల విచారణలో వెల్లడించింది. నయీం కిడ్నాపులు, బెదిరింపులు, డబ్బు గుంజడం లాంటివి చేసేవాడని చెప్పింది. ఇంట్లో బంగారం, వజ్రాలు, నగలు, నగదు ఉండేవని ఫర్హానా తెలిపింది. పెద్ద మొత్తంలో భూములకు సంబంధించిన పత్రాలు తీసుకొచ్చేవాడని వెల్లడించింది. నయీం తరచూ కొందరికి ఆయుధాలతో శిక్షణ ఇచ్చేవాడని చెప్పింది. ఫర్హానా చెప్పిన వివరాలను పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు.
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ ఎన్కౌంటర్లో నయీం హతమైన తర్వాత.. అలాపురి టౌన్ షిప్ వద్ద పోలీసులు ఫర్హానాతో పాటు కారు డ్రైవర్ భార్య అఫ్షాను అరెస్ట్ చేశారు. తుపాకులతో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది.
పోలీసుల విచారణలో ఫర్హానా ఏం చెప్పిందంటే.. 'నా భర్త మరణించాక నయీం దగ్గర వంటమనిషిగా చేరాను. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నన్ను నయీం బంధువు హైదరాబాద్కు తీసుకొచ్చాడు. నాతో పాటు అఫ్షా అనే మహళ నయీం ఇంట్లో పనిచేసేది. అతని కుటుంబ సభ్యులను, పిల్లలను చూసుకునేవాళ్లం. అతని పిల్లలను అలాపురి టౌన్షిప్నకు తీసుకువచ్చేవాడు. నయీంకు మాపై నమ్మకం ఉండేది. సోమవారం అఫ్షాతో కలసి టీవీ చూస్తున్నాను. ఆ సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. నయీం మరణించాడని గుర్తించాం. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాం. కొంత నగదుతో బయటపడాలనుకున్నాం. అయితే వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు' అని చెప్పింది.