నయీం అంత్యక్రియలపై వివాదం
భువనగిరి: ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం అంత్యక్రియలు నిర్వహించే విషయంపై వివాదం ఏర్పడింది. నయీం భార్య, పిల్లలు వచ్చే వరకు అంత్యక్రియలు చేయబోమని బంధువులు చెబుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం నయీం మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం అతని బంధువులకు అప్పగించారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా భువనగిరికి తరలించారు. కాసేపట్లో నయీం అంత్యక్రియలు జరగవచ్చు. భువనగిరిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. కాగా నయీం హతమైన తర్వాత పోలీసులు అతని భార్య, పిల్లలతో పాటు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
నయీం అంత్యక్రియలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అంత్యక్రియల దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ చేయరాదని, ఆంక్షలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.