-ఐసిస్ తీవ్రవాదులకు స్థానికంగా ఆశ్రయం
-ఎన్‌ఐఏ రాకతో కలవరం
-పోలీసులు అదుపులో నలుగురు వ్యక్తులు
ధారూరు (రంగారెడ్డి)
ఉగ్రమూకల సంచారం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. వికారాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణలో తేలడం ఆందోళన కలిగిస్తోంది. పవిత్ర రంజాన్ సమయంలో హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించాలని ఐసిస్ తీవ్రవాదులు పన్నిన కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఉగ్ర ముఠాకు నాయకత్వం వహించిన ఇబ్రహీం యజ్దానీ ఉపయోగించిన సిమ్‌కార్డులు వికారాబాద్ ప్రాంతంలో కొనుగోలు చేయడం, ఈ కార్డుల జారీకి సమర్పించిన పాస్‌పోర్టు జిరాక్సులు కూడా స్థానికులవే కావడం.. రాజధానిలో బాంబు పేలుళ్లు, దాడుల అనంతరం ఆనంతగిరిలో తలదాచుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. ఈ కోణంలో దర్యాప్తును సాగిస్తున్న పోలీసులు ధారూరు మండలం అంతారంలో ఈ ఉగ్రవాదుల కదలికలున్నట్లు గుర్తించారు. గ్రామంలోని ఓ ప్రార్థనామందిరంలో జరిగిన విందులో అనుమానిత టెర్రరిస్టులు పాల్గొన్నట్లు పసిగట్టారు.
నెలన్నర ఇక్కడే మకాం!
అంతారం గ్రామానికి వచ్చిన ఐదు మంది అనుమానితులు 45 రోజులు ఇక్కడే మకాం వేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రార్థనా మందిరాలు, సమీప ప్రాంతాలను సందర్శించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతం కావడం, తమ కదలికలపై అనుమానాలు రావనే ధీమాతో అంతారం గ్రామాన్ని సురక్షిత ప్రాంతంగా భావించినట్లు తెలుస్తోంది. కాగా, స్థానికంగా ఒకరు సహకరించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి సోదరుడి కుమారుడు ఏడాది క్రితం గిరాలేదని, అతని ఆచూకీ లేదనే ప్రచారం కొత్త సందేహాలకు తావిస్తోంది. ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై... కనిపించకుండా పోయారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమమవుతున్నాయి.
సహకరించెందెవరూ?
అనుమానిత ఉగ్రవాదులకు స్థానికంగా ఎవరు సహకరించారనేది ఎన్‌ఐఏ కూపీ లాగుతోంది. ఇందులోభాగంగా ఆదివారం కొందరిని ప్రశ్నించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో కీలకపాత్ర వహించిన ఒకరిని విచారించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇదిలావుండగా, భూములు కొంటామని నమ్మబలికి ప్రార్థనామందిరంలో మూడు రోజులపాటు తలదాచుకున్నారని కొందరు చెబుతుండగా, కేవలం పగటిపూట మాత్రమే వచ్చివెళ్లారని అంటున్నారు. ఇదిలావుండగా, ఎన్‌ఐఏ సూచన మేరకు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన నలుగురిని జిల్లా ఎస్‌పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది.
స్థానికంగా కలవరం!
అంతారం, కేరెళ్లి గ్రామాల్లో ఉగ్రవాదులు సంచరించినట్లు తేలడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఉదయమే గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన గ్రామస్తులు.. ఊరిలో గుర్తు తెలియని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని, జరిగిన సంఘటన గ్రామానికి చెడ్డపేరు తెచ్చిపెట్టిందని అభిప్రాయపడ్డారు. ప్రార్థనా మందిరాల్లోకి తెలిసిన వ్యక్తులనే అనుమతించాలని సమావేశంలో నిర్ణయించారు. అసాంఘిక శక్తులను దరి చేరనివ్వకూడదని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తీర్మానించారు.