భద్రాద్రికి పూర్వ వైభవం
- డివిజన్ పరిధిలోకి 9 మండలాలు
- విభజనంతో నష్టపోయిన భద్రాద్రికి ఊతం
- గతం కంటే పెరిగిన గ్రామాలు, జనాభా
భద్రాచలం : జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాచలం పట్టణానికి మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. భద్రాచలంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నిన్నటి దాకా ఆందోళనబాట పట్టినవారంతా...తాజా పరిణామాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐదు మండలాలకే పరిమితమైన భద్రాచలం రెవెన్యూ డివిజన్‌కు మరో నాలుగు మండలాలు కలుపుతూ ప్రభుత్వం డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలం డివిజన్‌కు ఈ చర్యలు ఊతమిచ్చేలా ఉన్నాయని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. పాల్వంచ డివిజన్ రద్దు చేసి, దాని పరిధిలో ఉన్న పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలను భద్రాచలం డివిజన్‌లో చేర్చారు. ఆయా మండలాల వారంతా రెవెన్యూ పనుల నిమిత్తం ఇక్కడకు రావాల్సి ఉంటుంది. దీంతో వ్యాపారపరంగా అభివద్ధి చెందే అవకాశాలున్నాయని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోని భద్రాచలం డివిజన్‌లో ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగూడెం జిల్లా ఏర్పడనుండడం, భద్రాచలం డివిజన్ పరిధిలోనే భద్రాద్రి పవర్ ప్లాంటు, సింగరేణి హెడ్‌క్వార్టర్, హెవీ వాటర్ ప్లాంట్, సారపాక ఐటీసీ కర్మాగారం వంటి భారీ కేంద్ర, రాష్ట్ర స్థాయి పరిశ్రమలపై ఇక్కడి డివిజన్ అధికారుల అజమాయిషీ ఉంటుంది.
ఆ నాలుగు వస్తే ఇంకా మేలు
భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని, పర్ణశాలకు వెళ్లే దారిలో ఉన్న నాలుగు పంచాయతీలు(ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం) తిరిగి తెలంగాణలో కలిస్తే∙భద్రాచలం అభివద్ధి పుంతలు తొక్కే అవకాశాలున్నాయి. డివిజన్ కేంద్ర పరిధి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణం విస్తరణ జరగాలంటే చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు అందుబాటులో ఉండాలి. కానీ భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కావటంతో పట్టణంలోని చెత్త పోసేందుకు కూడా స్థలం లేదు.
.........................................................................................................
డివిజన్ స్వరూపం ఇలా...
ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లాలో
మండలాలు 8 9
గ్రామాలు 650 726
పంచాయతీలు 119 88
మున్సిపాలిటీ 0 1
జనాభా 2,96,530 3,87,110
.........................................................................................................