ప్రభుత్వ బడికి..ప్రాణం పోశారు! | Villagers Have Embraced To Bring Back Former Glory Of School. | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడికి..ప్రాణం పోశారు!

Published Fri, Jun 21 2019 9:33 AM | Last Updated on Fri, Jun 21 2019 9:33 AM

Villagers Have Embraced To Bring Back Former Glory Of School. - Sakshi

సాక్షి,శ్రీకాకుళం : ఐకమత్యంగా ఉంటే ఎంతటి అవరోధాన్నైనా సులువుగా అధిగమించవచ్చని నిరూపించారు బైపల్లి గ్రామస్తులు. 1959లో ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రారంభమైన ఈ బడిలో కాల క్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ప్రాథమిక పాఠశాలగా మారింది. మరికొద్ది సంవత్సరాలకు ఉపాధ్యాయులు లేక దీనస్థితికి చేరుకుంది. గత ఏడాది 13 మంది విద్యార్థులతో మూతపడే పరిస్థితికి చేరుకుంది. దీంతో గ్రామస్తులు పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. అయితే విద్యార్థుల కొరత ఉండటంతో నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించలేదు.

గతంలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై పలాస మండలానికి వెళ్లిపోవడంతో కేవలం డిప్వూటేషన్‌లో ఉపాధ్యాయులు వచ్చి వెళ్లేవారు.  దీంతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారు. ఈ ఏడాది మాత్రం తమ పిల్లలకు మెరుగైన విద్య అందాలనే ఉద్దేశంతో గ్రామస్తులు మూడుసార్లు సమావేశమయ్యారు. గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, పెద్దలు, ఉద్యోగుల నుంచి సుమారు రూ.4 లక్షలు సేకరించి పాఠశాల నిధిని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంటిం టా తిరిగి విద్యార్థుల తలిదండ్రులను ఒప్పించి ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న మరో 60 మంది విద్యార్థులను బడిలో చేర్పించారు. వీరికి విద్యను అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుని కోసం ఎదురు చూడకుండా గ్రామంలో పాఠశాల బలోపేత కమిటీని ఏర్పాటు చేసి  అర్హులైన ముగ్గురు వలంటీర్లను నియమించారు.

నెలకు రూ.20 వేలు ఖర్చు..
పాఠశాలలో ముగ్గురు విద్యా వలంటీర్లు, మరో ఆయాను నియమించారు. వలంటీర్ల కు ఒక్కొక్కరికీ గౌరవ వేతనంగా రూ.5000, ఆయాకు  రూ.3000 అందిస్తున్నారు.  ఇప్పటికే కొందరు దాతలు ముందుకు వచ్చి పాఠశాలకు రంగులు, ఫర్నిచర్, యూనిఫాం, నోట్‌ పుస్తకాలు సమకూర్చారు. ప్రభుత్వ సహాయం లేకుండా సొంతంగా విద్యార్థుల కు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం పాఠశాలలో చినవంక పాఠశాల నుంచి చొక్కరి ధర్మారావు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు డిప్యూటేషన్‌పై వచ్చి తరగతులు బోధిస్తున్నారు.  

సామూహిక అక్షరాభ్యాసం..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇటీవల రాజన్న బడిబాట కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా బైపల్లి పాఠశాలలోనూ అధి కారుల సమక్షంలో సాముహిక సుమారు 25 మంది పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మండల ప్రత్యేకాధికారి శ్రీని వాస్, తహసీల్దార్‌ కల్పవల్లి, ఎంపీడిఓ తిరుమలరావు, ఎంఈ చిన్నవాడుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement