గొల్లభామ’ చీరలకు పేరు తెస్తా..!
సినీ నటి, చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత
సిద్దిపేట జోన్/దుబ్బాక/దుబ్బాక టౌన్: గొల్లభామ చీరలకు పూర్వ వైభవం తెచ్చేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని ప్రముఖ సినీనటి, చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత హామీ ఇచ్చారు. గురువారం సిద్దిపేట, దుబ్బాకలో చేనేత సొసైటీలను సందర్శించిన ఆమె, అందులో పనిచేస్తున్న కార్మికులను పలకరించారు. నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ ఉత్పత్తులను తయారు చేస్తే బంజారాహిల్స్‌లోని తన ‘సిగ్నేచర్’వస్త్ర దుకాణంలో గొల్లభామల చీరల విక్రయానికి శ్రద్ధ తీసుకుంటానన్నారు. తనతోపాటు వేలాదిమంది గొల్లభామ చీరలను కొనేలా ప్రోత్సహిస్తానన్నారు.
దుబ్బాకలో చేనేత వస్త్రాల తయారీలో ఉన్న కార్మికుల జీవనస్థితిగతులను సమంత అడిగి తెలుసుకున్నారు. తయారీలో సంప్రదాయ విధానాలను పాటించడం వల్లే చేనేత ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ చేనేత రంగంపై శ్రద్ధ వహించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారని, త్వరలోనే కార్మికులకు మంచిరోజులు వస్తాయన్నారు. కార్మికులకు సరిపడా పనికల్పించి గౌరవంగా బతికేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. తాను కార్మికుల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నానని, అందుకే సొసైటీలను తరచూ సందర్శించి కార్మికుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఆత్మహత్యల్లేని చేనేత రంగమే తన ధ్యేయమని సమంత అన్నారు.