అభినయ ఖిల్లా ‘జబీవుల్లా’
గుంతకల్లు: అభినయంలో అందెవేసిన చేయి రిటైడ్ రైల్వే ఉద్యోగి జబీవుల్లా. జబీవుల్లా నటనకు ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందాల్సిందే. తను స్టేజీపైకెక్కితే చాలు.. అవార్డుల తన చెంతకు రావాల్సిందే. ఎన్నో నాటకాల్లో ఇప్పటిదాకా ఏకంగా 50కి పైగా అవార్డులు, ప్రశంసా పత్రాలు, షీల్డులు దక్కించుకున్నారు. తాజాగా 2017కు అనంతపురం జిల్లా స్థాయి బళ్లారి రాఘవ అవార్డు ఎంపిక కావడం గమనార్హం. ఆగస్టు 3న బళ్లారి రాఘవ అవార్డును ఆయనకు అందజేయనున్నారు.
గుంతకల్లు రైల్వే డివిజన్‌లో కేంద్ర కార్యాలయంలో క్రాప్ట్‌మెన్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్)గా పని చేస్తూ మూడేళ్ల క్రితం ఉద్యోగవిరమణ చేసిన జబీవుల్లా పూర్తి పేరు మహమ్మద్ ఇస్మాయిల్ జబీవుల్లా. మద్రాస్ సదరన్ మరాఠా రైల్వేస్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహించిన సయ్యద్ జబీవుల్లా బషీరున్నీషా దంపతులకు రెండవ సంతానంగా 1954 ఏప్రిల్ 8వ తేదీన తమిళనాడులోని అరక్కోణంలో జన్మించాడు. జబీవుల్లా తండ్రి ఉద్యోగ రిత్యా ఆంధ్రాకు వచ్చి స్థిరపడ్డాడు. 1970లో రెండవ తరగతి పూర్తి చేసుకున్న అనంతరం తొలిసారిగా కడప జిల్లా నందలూరులో విశ్వాత్తాపం అనే నాటకంలో ప్రతి నాయకుడి పాత్రను పోషించి నాటక జీవితాన్ని అరంభించాడు. ఈ నాటకంలో ఇతర నటనకు ఉత్తమ విలన్‌గా అవార్డు వచ్చింది.
1971లో గుంతకల్లులో చంద్రయ్య అనే నటుడు నిర్వహిస్తున్న రవీంద్ర ఆర్ట్స్‌లో చేరి ఉత్తమ కళాకారులుగా రాణించిన సీపీ రామ్మూర్తి, కోటేశ్వరరావు ఆనంద్, పంజా ప్రసాద్‌రావు సహకారంతో అనేక నాటకాల్లో నటించారు. ముఖ్యంగా ప్రఖ్యాత హాస్యనటుడు దివంగత గురుమూర్తి వద్ద హాస్యం నుంచి ట్రాజడీకి వెళ్లే కళను నేర్చుకున్నాడు. ఇక నాటి నుంచి అనేక హృదయ విదారక సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. ప్రధానంగా రైల్వే ఉద్యోగిగా రైల్వే ఆస్తుల భద్రత, ప్రయాణీకుల రక్షణపై, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదాలతో జరిగే నష్టాలు తదితర అంశాలపై అనేక నాటకాలు రచించడంతో పాటు ఏక పాత్రాభినయాలు చేసి అధికారులను మెప్పించారు. 2000లో రైలు మార్గాలపై ఉండే మనిషి కాపలా ఉండని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలపై డాక్యుమెంటరీ చిత్రానికి అప్పటి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ స్పందించి ఉత్తమ నటుడిగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
చాలా అనందంగా ఉంది
బళ్లారి రాఘవ అవార్డు(2017)కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నాటకాల్లో అభినయించడం వల్ల జీవితం ఎంతో హాయిగా గడపడంతో పాటు మంచి నడవడిక అలవడింది.
– జబీవుల్లా, రిటైడ్ రైల్వే ఉద్యోగి