జై జగన్నాథా
-
వైభవంగా సాగిన జగన్నాథుడి రథయాత్ర
-
గూడూరులో కోలాహలం
గూడూరు: హరేరామ..హరేకృష్ణ నామస్మరణతో గూడూరు పట్టణం శనివారం మార్మోగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను వైభవంగా నిర్వహించారు. యాత్రలో భాగంగా భక్తులు చేసిన పండరి భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. రథంపై కొలువైన జగన్నాథుడిని దర్శించుకునేందుకు పట్టణ వాసులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. గూడూరులో 4వ జగన్నాథ రథయాత్రను పట్టణంలోని డీఎన్‌ఆర్ కమ్యూనిటీ హాలు ప్రాంతంలో ఐసీఎస్ రోడ్డు మీదుగా పట్టణ వీధుల్లో సాగింది. ప్రతి ఇంటి ముంగిట్లో ముగ్గులు తీర్చిదిద్ది రథయాత్రకు స్వాగతం పలికారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. కుమ్మరివీధి యూత్ కడివేటి చంద్రశేఖర్, కంప్యూటర్ శీను, బుజ్జి, పురుషోత్తం, కాటూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రసాద పంపిణీ జరిగింది. యాత్రకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎస్సైలు సుధాకర్, నరేష్ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ పొనకా దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.