లేపాక్షి ఆలయంలో ‘జై భవాని’ బృందం
లేపాక్షి: పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయాన్ని మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా కానాపూర్‌కు చెందిన జై భవాని నవరాత్రి మండలి బృందం ఆదివారం సాయంత్రం సందర్శించింది. ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ కానాపూర్‌లో భవానిమాత దేవాలయం ప్రసిద్ధి చెందినదని, ప్రతి నవరాత్రి ఉత్సవాలనూ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటామని తెలిపారు.
అయితే సుప్రసిద్ధమైన అమ్మవారి ఆలయంలో కాగడా జ్యోతిని వెలిగించి భవానిమాతకు సమర్పించిన తర్వాతే ఈ ఉత్సవాలు చేసుకుంటామన్నారు. అందులో భాగంగానే తిరుపతి వద్ద అలివేలి మంగాపురంలో వెలసిన పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం మధ్యాహ్నం కాగడా జ్యోతిని వెలిగించిన అనంతరం పాదయాత్ర ద్వారా లేపాక్షి ఆలయ సందర్శనకు వచ్చామన్నారు. ఈనెల 21వ తేదీ కానాపూర్ చేరుకుని భవానిమాతకు జ్యోతిని సమర్పించి ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు.