బాబు మహా‘డప్పు’ సభ..
బాబు మహా‘డప్పు’ సభ..
Published Sun, May 28 2017 11:51 PM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM
టీడీపి మహానాడుపై జక్కంపూడి రాజా విసుర్లు
సీతానగరం (రాజానగరం) : విశాఖలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు.. బాబు మహాడప్పు సభగా మారిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అద్యక్షుడు జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఆదివారం నిర్వహించిన లంకూరు మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారం కోసం మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, మహానాడులో ఆయన ఫోటోకు భజన చేస్తున్నారన్నారు. టీడీపీ వారసత్వాన్ని నందమూరి వంశీయులకు కాకుండా లోకేష్‌కు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. లోకేష్‌కు దొడ్డిదారిన మంత్రి పదవి ఇచ్చి, పార్టీకి వారసత్వం ఇచ్చేందుకు తంటాలు పడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టారని, ఆ తర్వాత 1999లో బీజేపీ పొత్తుతో గెలిచిన చంద్రబాబు.. తిరిగి 2014లో బీజేపీ పొత్తు, జనసేన సహకారంతో అధికారంలోకి వచ్చారన్నారు. పొత్తు లేకుండా ఎన్నికలలో చంద్రబాబు గెలిచిన సందర్బం లేదన్నారు. ఆడపడుచులకు పార్టీలో పెద్దపీట వేశామని డప్పు కొట్టుకునే టీడీపీలో మహిళలతో కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. టీడీపీ నాయకురాలు, సినీ నటి కవిత మహానాడులో జరిగిన అవమానంకు కంటతడి పెట్టారని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీని దెయ్యాల కొంప అని టీడీపీ ఎమ్మెల్సీ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీలోకి చేరేందుకు ఇతర పార్టీల ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని ఎన్టీఆర్ తొలి మహానాడులో తీర్మానం చేశారని, చంద్రబాబు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి డిపాజిట్ గల్లంతు అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ బాబు, వలవల రాజా, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement