అసెంబ్లీ దృష్టికి నర్సరీ మీటర్ల సమస్య
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల దృష్టికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా నర్సరీలకు విద్యుత్ మీటర్ల అంశాన్ని తీసుకువెళ్లనున్నట్టు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. కడియం మండలం మాజీ జెడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రయ్య చేతికి గాయం కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరవరంలోని దొంతంశెట్టి స్వగృహంలో బుధవారం ఆయన్ను పరామర్శించిన అనంతరం స్థానిక విలేకరులతో జక్కంపూడి రాజా మాట్లాడారు. ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్‌లలో సైతం డబ్బులు దండుకుంటున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు నర్సరీ రైతులు ఇబ్బందులు కన్పించడం లేదన్నారు. నర్సరీ రైతుల సమస్యను జగన్ ద్వారా అసెంబ్లీలో ప్రస్తావింపజేస్తామని జక్కంపూడి తెలిపారు. అంతే కాకుండా సమస్య పరిష్కారానికి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వెల్లడించారు. రాజా వెంట మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి ఉన్నారు.