పెరవలి/పెనుగొండ : ‘గోదావరిలో నిండుగా నీరున్నా.. వరదనీరు సముద్రం పాలవుతున్నా.. సాగునీరు అందక జిల్లాలో నారుమళ్లు ఎండిపోతున్నాయి. ముందస్తు సాగు అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం సాగునీరు అందించడం లేదని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు’ అంటూ ఎమ్మెల్యేలు, నీటి సంఘాల అధ్యక్షులు అధికారులపై ధ్వజమెత్తారు. పంట విరామానికి సైతం రైతులు సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో సాగునీరందక రైతులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన వరుస కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. కలెక్టర్ కాంటంనేని భాస్కర్ గతంలో ఎన్నడూలేనివిధంగా హడావుడిగా పెరవలి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నీటిపారుదల సలహా సంఘ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో నిడదవోలు, పాల కొల్లు, తణుకు, నరసాపురం ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, నిమ్మలరామానాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ, బండారుమాధవ నాయుడు పాల్గొన్నారు. వీరి మధ్య పరోక్షంగా అభిప్రాయభేదాలు పొడచూపాయి. ఇవి నీటి యుద్ధానికి తెరలేపాయి. అధికారుల తీరుపైనా ఎమ్మెల్యేలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. డెల్టా ప్రాంత ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, ఆరుమిల్లి రాధాకృష్ణ తమ నియోజకవర్గాల్లోని పొలాలకు నీరు అందట్లేదని ధ్వజమెత్తారు. నిడవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తమ ప్రాంతంలోని కాలువల్లో నీళ్లు పొంగిపొర్లుతున్నాయని గట్లు తెగిపోతాయేమోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా దాళ్వాలో సాగునీటి ఇబ్బందులు ఉంటాయని, ఈ సారి అధికారుల ప్రణాళికా, సమన్వయ లోపాల వల్ల సార్వాలోనూ కష్టాలు తప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీలో ఉన్నందున రోడ్డెక్కలేకపోతున్నామని, చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తోందని, రైతులకు ఎలా సమాధానం చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరూరా తిరిగి ముందస్తు సాగు చేయాలని ఆర్భాటంగా ప్రచారం చేశామని, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ఏరువాక ప్రారంభించారని, చివరకు ఇలా అభాసుపాలు కావాల్సి వచ్చిందని బాధను వెళ్లగక్కారు. నారుమడులు వేసి 30 రోజులు దాటుతున్నా.. నాట్లు వేయలేని దుస్థితిలో రైతులు ఉన్నారని ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ దశలో రైతులను ఆదుకోకపోతే ఎమ్మెల్యేలుగా కొనసాగడం అర్థరహితమని పేర్కొన్నారు.
పాఠాలు నేర్పుతున్నారు
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. తమకూ రైతుగా అనుభవం ఉందని, అయినా అధికారులు పాఠాలు నేర్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రధాన కాలువలోనీటి మట్టం గతంలో ఎన్నడూ లేనంతగా 6.6 అడుగుల ఎఫ్‌ఎస్‌ఎల్ కొనసాగిస్తున్నామంటూ అధికారులు చెప్పడాన్ని ఆయన ఖండించారు. పంటకాలువలకు నీరు ఇవ్వకుండా నీటి మట్టాన్ని నిలబెడితే ఉపయోగమేమిటని ప్రశ్నించారు. దాళ్వాలోనే పాలకొల్లు నియోజకవర్గంలో 8 వేల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారని, వారికి సార్వాలోనూ నీరివ్వకుంటే తాము గ్రామాల్లో తిరగలేమని స్పష్టం చేశారు. నర్సాపురం కాలువ పరిధిలోని జిన్నూరు చానల్‌కు 180 క్యూసెక్కులు ఇవ్వాల్సి ఉండగా.. 140 క్యూసెక్కులు, చించినాడకు 170 క్యూసెక్కులకు గాను 100 క్యూసెక్కులు, దిగమర్రుకు 150 క్యూసెక్కులకు గాను 90 క్యూసెక్కులు నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారని వివరించారు.
ఏమిటీ నియామకాలు
నీటి పారుదల శాఖలో అధికారుల నియామకాలపై తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ విరుచుకుపడ్డారు. అనుభవంలేని అధికారులను డెల్టాలో నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేని అధికారులను ఇక్కడ నియమించారని మండిపడ్డారు. అత్తిలి, రాపాక చానల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు.
మూడురోజుల్లో పరిష్కారం
సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. అధికారుల సమన్వయలోపంతోపాటు జిల్లాలో ముందస్తు సాగుకు ఒకేసారి రైతులందరూ సిద్ధం కావడం వల్లే సాగునీటి సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. గతంలో ఖరీఫ్ సాగు రెండు భాగాలుగా జరిగేదని, డెల్టాకు, అప్‌లాండ్ ప్రాంతానికి కనీసం 20 నుంచి 30 రోజుల కాలవ్యవధి ఉండేదని వివరించారు. అయితే.. నవంబరులో వచ్చే తుపాన్ల బెడద నుంచి రైతులను తప్పించాలనే ఉద్దేశంతో ముందస్తు సాగు విధానాన్ని ప్రచారం చేశామని, రైతులందరూ ఒకేసారి సాగుకు సిద్ధం కావడం ఈ మధ్యలో 15 రోజులపాటు వర్షాలు లేకపోవడంతో నీటి ఎద్దడి తలెత్తిందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడురోజుల్లో సమస్యను పరిష్కారిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రానివ్వనని స్పష్టం చేశారు.
సమీక్షకు దూరంగా ఎమ్మెల్యే పితాని
సమీక్ష సమావేశానికి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఇటీవల పితాని తన నియోజకవర్గ ఇరిగేషన్ అధికారులతో సమావేశమై నీటి సమస్యపై చర్చించినా పరిష్కారం కాలేదు. దీనివల్లే ఆయన ప్రస్తుత జిల్లా సమావేశానికి గైర్హాజరయ్యారని తెలుస్తోంది. పైగా ముందస్తు సాగుకు తగ్గట్టుగా ప్రణాళిక వేయడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న భావనతో ఆయన దూరంగా ఉన్నట్టు సమాచారం.
క్యాలెండరు ప్రకారం పనులు నిర్వహించాలి
కాగా, కాలువల నిర్వహణపై ప్రభుత్వం, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలకు నీటిని నిలుపుదల చేసిన సమయంలో పనులు చేపట్టకుండా కాలువలకు నీటిని వదిలే సమయంలో పనులుచేపట్టి మధ్యలో నిలిపివేస్తూ నిధులు దండుకొంటున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి క్యాలెండరు ప్రకారం పనులు నిర్వహించాలని పలువురు డిమాండ్ చేశారు.
లాకులు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యా
నరసాపురం ప్రధాన కాలువ పరిధిలోని ఎమ్మెల్యేల మధ్య జల జగడం రేగింది. ఎగువ ప్రాంత ఎమ్మెల్యేలు దిగువకు నీరు రాకుండా అడ్డుపడుతున్నారని, దీంతో పాలకొల్లు లాకులు బద్దలు కొట్టడానికి వెయ్యి మంది రైతులతో కలిసి సిద్ధమయ్యాయని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సమావేశంలో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలను బహిర్గతం చేసింది. తన నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం కొత్తపాలెం, ఖాళీపట్నంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల్లో నీటి మట్టాలు లేకపోవడంతో ఉన్న నీటిలో ఉప్పుశాతం పెరిగిపోయిందని వివరించారు.
బూరుగుపల్లితో రైతుల వాగ్వాదం
నిడదవోలు నియోజకవర్గంలోని కాలువల్లో నీళ్లు పొంగిపొర్లుతున్నాయని, దీనివల్ల చేలు మునిగిపోతున్నాయని అక్కడి ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు చెప్పారు. దిగువ రైతుల శ్రేయస్సు కోసం తమ రైతులు త్యాగాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో పాలకొల్లు నియోజకవర్గ నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు శేషారావుతో వాగ్వాదానికి దిగారు. పెరవలిలో లాకుల వద్ద రెండు అడ్డంకులు ఉన్నందునే దిగువ ప్రాంతాల రైతులకు నీళ్లు అందడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు ఎస్‌ఈ కె.శ్రీనివాసులు, సీఈ ఎస్‌హరిబాబు, ఈఈ జి.శ్రీనివాసరావు, జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, ఆర్డీవో బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.