-
ప్రతిపాదనల ప్రకారమే ముసాయిదా
-
వేగంగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ
-
భవనాలు, మౌలిక వసతుల కల్పనపై యంత్రాంగం దృష్టి
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియపై స్పష్టత వచ్చింది. వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్విభజించాలని జిల్లా యంత్రాంగం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారమే జిల్లాల పునర్విభజన ముసాయిదా సిద్ధమవుతోందని విశ్వనీయ సమాచారం. వరంగల్, ప్రొఫెసర్ జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ పేర్లతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఉద్యోగులు, సిబ్బంది కేటాయింపులపై ప్రభుత్వానికి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం మరోసారి పరిశీలిస్తోంది.
కొత్త జిల్లాల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాలు, ఇతర మౌలికవసతుల కల్పన ప్రక్రియ వేగవంతమైంది. జిల్లాల పునర్విభజనపై జూన్‌లో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 29న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పునర్విభజనపై ప్రతిపాదనలు చేశారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ జిల్లా నేతలకు పునర్విభజనకు సంబంధించిన మ్యాప్‌లను అందజేశారు. జనగామను జిల్లాగా చేసే ప్రతిపాదనలు గతంలో లేకపోవడంతో ముసాయిదాలోనూ ఇదేతీరుగా ఉండనుందని సమాచారం. ఈ నెల 22న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేయనుంది.
అక్టోబరు 11 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన కార్యక్రమాలు మొదలుకానున్నాయి. జిల్లా యంత్రాంగం, జిల్లా నేతలు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, కమలాపురం, భీమదేవరపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలు వరంగల్ జిల్లాలో కలవనున్నాయి. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, ఇల్లందు మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇల్లందు మండలం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తుది ప్రతిపాదనలు ఖరారు కావాల్సి ఉంది. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల మండలాలను యాదాద్రి జిల్లాలో... చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేటలో కలపడం ఖాయమైంది. మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు, మహదేవపూర్ మండలాలు భూపాలపల్లి జిల్లాలో ఉండనున్నాయి.
జిల్లాల పునర్విభజనపై ప్రస్తుత ప్రతిపాదనలు...
వరంగల్ జిల్లా : వరంగల్, హన్మకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, శాయంపేట, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, రాయపర్తి, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట.
ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, మహాముత్తారం, మల్హర్‌రావు, కాటారం, మహదేవపూర్.
మానుకోట జిల్లా : మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, డోర్నకల్, నర్సింహులపేట, మరిపెడ, కురవి, తొర్రూరు, కొడకండ్ల, కొత్తగూడ, గార్ల, బయ్యారం, ఇల్లందు.