అవినీతి అధికారిపై వేటు
గతంలో జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్ పరిధిలో ధర్మాజీగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన సమయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖ విడుదల చేసిన స్టిక్కర్ల విషయంలో లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన్ను అక్కడి నుంచి వీఆర్‌కు పిలిచారు. ఆ తరువాత వీఆర్ నుంచి డీసీఆర్‌బీకి బదిలీ చేశారు. ఆ తరువాత డీసీఆర్‌బీ నుంచి జంగారెడ్డిగూడెం బదిలీ చేశారు. ఎస్సై కేశవరావుపై డీజీపీ, డీఐజీ, ఎస్పీకి కూడా పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో శ్రీనివాసపురం కోడిపందాల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి గాల్లోకి రివ్వాలర్ కాల్చి కోడిపందాలు ప్రారంభించిన కేసులో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల జంగారెడ్డిగూడెంలో ఒక కర్మాగారం నుంచి లక్ష రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఒక సివిల్ వివాదానికి సంబంధించి ఒక వ్యక్తి నుంచి రూ. 20వేలు తీసుకోగా, అతనికి న్యాయం చేయకపోవడంతో ఆ వ్యక్తి, డీఐజీ, డీజీపీ, ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో కొంతమంది సిబ్బందిని, కొంతమంది బయట వ్యక్తులను ఏజెంట్‌లుగా నియమించుకుని పెద్దెత్తున వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, పశువుల వ్యాపారులు, కోడిపందాలు, పేకాట నిర్వాహకుల నుంచి కూడా రోజూవారీ మామూళ్ళు వసూలు చేస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పందుల పెంపకందార్లను కూడా వదలలేదని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
భార్యభర్తల కేసు స్టేషన్‌కు వస్తే ఇరువర్గాలను కౌన్సెలింగ్ చేయాల్సింది పోయి పెద్దెత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఇక ఇసుక మాఫియా నుంచి ప్రత్యేక వసూళ్ల కోసం కొంతమంది వ్యక్తులను నియమించుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల ఒక యువతి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే ఆమెపైనే కేసు నమోదు చేశారని జిల్లా ఎస్పీకి ఆ మహిళ ఫిర్యాదుచేయగా, ఎస్పీ దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. ఇదిలా ఉండగా ఎస్సై కేశవరావు అవినీతి ఆరోపణలపై బదిలీ అవ్వడాన్ని డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ నిర్ధారించారు. తదుపరి విచారణ జరుగుతున్నట్లు తెలిపారు.