నిరసనలు.. నిలదీతలు
నిరసనలు.. నిలదీతలు
Published Mon, Jan 2 2017 11:32 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
పోలీస్ బందోబస్తు నడుమ జన్మభూమి గ్రామసభలు
పింఛనుదారులే సభికులు
కలెక్టర్‌పై ధ్వజమెత్తిన పితాని
సమస్య చెప్పిన వ్యక్తిపై నోరుపారేసుకున్న బూరుగుపల్లి
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ప్రజల నిరసనలు.. నిలదీతల నడుమ జన్మభూమిమా ఊరు కార్యక్రమం జిల్లాలో సోమవారం మొదలైంది. నిరసనలు వెల్లువెత్తుతాయని ముందే ఊహించిన ప్రభుత్వం గ్రామ సభల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. తొలి రోజున నిర్వహించిన సభల్లో ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులకు సంబంధించి ధరఖాస్తులు స్వీకరించారు. గడచిన జన్మభూమి సభల్లో ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన దరఖాస్తులకు ఎలాంటి హామీలు లభించలేదు. మొక్కుబడిగా కొందరికి రేషన్ కార్డులు ఇచ్చారు. చాలాచోట్ల కార్డులు అందుబాటులోకి రాకపోవడంతో పేర్లు చదివి మమ అనిపించారు. తొలిరోజే ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కలెక్టర్ కాటంనేని భాస్కర్ తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. కలెక్టర్ తీరు అర్థరహితంగా ఉందని, దీనివల్ల కొన్ని పంచాయతీలకు సొంత భవనాలు లేక పరాయి పంచన నిర్వహించాల్సి వస్తోందంటూ గ్రామసభలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దొంగరావిపాలెం, సిద్ధాంతం, రామన్నపాలెం, తామరాడల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో మాట్లాడిన పితాని ప³ంచాయతీ భవనాల నిర్మాణానికి జిల్లాలో కొత్త పొకడ అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీ భవన నిర్మాణాలకు 30 శాతం స్థానికుల భాగస్వామ్యం కావాలంటూ నిర్మాణాలకు మోకాలడ్డుతున్నారని వివరించారు. పోలవరం మండలం మామిడిగొందిలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, అందుకే తాము జన్మభూమికి రావడం లేదని అక్కడి ప్రజలు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దార్ ఎం.ముక్కంటి నచ్చచెíప్పి సమావేశం నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో రేషన్ కార్డులు ఇవ్వటం లేదంటూ ప్రజలు అదికారును నిలదీశారు. ప్రతి జన్మభూమిలో తన పేరు చదువుతున్నా ఇప్పటివరకూ రేషన్ కార్డు రాలేదంటూ కొమరవరం గ్రామానికి చెందిన తెల్లం శారామణి అవేదన వ్యక్తం చేసింది. తన బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, వైద్యం చేయించాలన్నా ఇతర పనులకు దేనికైనా కార్డు జిరాక్స్ అడుగుతున్నారని వాపోయింది. కార్డు కోసం దరఖాస్తు చేసుకుని కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోరా? కార్డు ఇవ్వరా అంటూ నిలదీసింది. నరసాపురం 3వ వార్డులో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతుండగా మూపితి లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ ఎన్నిసార్లు తిరిగినా తనకు వితంతు పింఛను ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొత్త నవరసపురంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ఈదా జోన్సీ గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఎమ్మెల్యే పాల్గొన్న గొంది గ్రామసభలో కనీసం టెంట్ వేయకపోవడంతో ఎండలోనే జనం కూర్చున్నారు. సమస్యలపై జనానికి పెద్దగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, జాగ్రత్తలు తీసుకుని మొక్కుబడిగా సభలు ముగించారు. చంద్రన్న బీమా కోసం అంటూ డ్వాక్రా కమ్యూనిటీ అర్గనైజర్లు ఒక్కొక్కరి నుంచి అదనంగా రూ.5 వసూలు చేశారని యలమంచిలిలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో పోలీసు బందోబస్తు మధ్య జన్మభూమి ఏంటంటూ గ్రామస్తులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. అడుగడుగునా గ్రామస్తులకు పోలీసులు అడ్డుతగలడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డులు పంపిణీ చెయ్యకుండా మళ్లీ పేర్లు మాత్రమే చదవడంపై జీలుగుమిల్లి మండలం గంగన్నగూడెం, ములగలంపల్లి గ్రామాల ప్రజలు నిలదీశారు. ప్రజా సమస్యలపై అడిగితే అరెస్టు చేయించేందుకు కూడా ప్రజాప్రతినిధులు వెనకాడటం లేదు. పెరవలి మండలం ఖండవల్లిలో శ్మశానాని స్థలం కేటాయించాలని, బెల్ట్ షాపులను తొలగించాలని అడిగిన గ్రామస్తుడిపై నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నోరు పారేసుకున్నారు. ’నన్నే అడుగుతావా.. జాగ్రత్త’ అని హెచ్చరించడమే కాకుండా ఎస్సైని పిలిచి ’ముందు ఇతణ్ణి అరెస్ట్ చెయ్. ఫిర్యాదు నేను ఇస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ రాష్ట్ర మంత్రి పీతల సుజాతను చింతలపూడిలో మహిళలు చుట్టుముట్టి నిలదీశారు.
Advertisement