సంక్షేమానికి జేసీ వ్యతిరేకం | JC is the opposite of welfare | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి జేసీ వ్యతిరేకం

Published Mon, Jun 5 2017 11:22 PM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM

సంక్షేమానికి జేసీ వ్యతిరేకం - Sakshi

సంక్షేమానికి జేసీ వ్యతిరేకం

  •  కమీషన్ల కోసం కక్కుర్తి
  • మట్కా, పేకాటను ప్రోత్సహిస్తున్నారు
  • జేసీ బ్రదర్స్‌కు కాలం చెల్లింది..
  • వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
  • తాడిపత్రి ప్లీనరీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత
  •   

    ‘రైతులకు ఉచిత విద్యుత్‌ వద్దంటారు. రూపాయికి కిలోబియ్యం దండగ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతులు, పేదల సంక్షేమానికి జేసీ దివాకర్‌రెడ్డి వ్యతిరేకం’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ ప్లీనరీ సోమవారం స్థానిక ఎస్‌బీఎం ఫంక‌్షన్‌హాలులో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగింది.

     

    ముఖ్య అతిథిగా అనంత మాట్లాడారు. ‘‘హంద్రీ–నీవా ద్వారా 2012లో నీళ్లు తీసుకొచ్చాం. పాదయాత్ర చేస్తుంటే నీళ్లు ఎలా వస్తాయన్నావ్‌! హంద్రీ–నీవా కంటే మూణ్నెల్ల ముందు రూ.560 కోట్లతో యాడికి కాలువకు శంకుస్థాపన చేయించావ్‌. పీఏబీఆర్‌ ద్వారా 10 టీఎంసీల జలాలు కేటాయించాం. 13 ఏళ్లయ్యింది. ఇప్పటి వరకూ ఎందుకు ఆ ఫలితాన్ని ప్రజలకు ఇవ్వలేదు. పెండేకల్లుకు చెన్నారెడ్డితో శంకుస్థాపన చేయించావు. అందులోనూ కమీషన్లకు కక్కుర్తిపడ్డావు. శ్రీరామరెడ్డి పథకం ద్వారా మేం నీళ్లిస్తే...జేసీ నాగిరెడ్డి పథకం ద్వారా ఇప్పటికీ మీరు నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు తిరిగి అవుకు నుంచి తీసుకొస్తా అంటున్నావు. కొత్త పనులు మంజూరు చేయించుకుని కమీషన్లు దండుకోవడం తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ధ్యాస లేదు. 2012లో హంద్రీ– నీవా నీళ్లు తీసుకొస్తే ఇప్పుడు పులివెందుల, ముచ్చుమర్రి మీటింగ్‌కు వెళ్లి చంద్రబాబును పొగుడుతున్నారు.

    తాడిపత్రిని మట్కా, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నావ్‌. జూదం ఆడేవారిని నీ చుట్టూ కోటరీలా పెట్టుకున్నావ్‌. కర్నూలు, కడప జిల్లాల నుంచి జూదం కోసం తాడిపత్రికి వస్తున్నారు. ఇందులో కమీషన్లు నీ ఇంటికి వస్తున్నాయ్‌. 1989కి ముందు నీ పరిస్థితేంటి? ఇప్పుడేంటి? తాడిపత్రికి ఏం చేశావో చెప్పు. యాడికి కెనాల్‌ భూసేకరణ సమస్య ఉందంటున్నావ్‌. 12శాతం తక్కువకు కోట్‌ చేసిన నేషనల్‌ హైవే టెండర్లనే రద్దు చేసిన ఘనుడివి. ఇది  నీకు పెద్ద సమస్యనా? తాడిపత్రిలో వాక్‌ స్వాతంత్య్రం లేదు. మాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడి ప్రజలకు వాక్‌ స్వాతంత్ర్యం తెస్తాం. జేసీ బ్రదర్స్‌ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. వీరికి కాలం చెల్లించింది’ అని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే ప్లీనరీ ఏర్పాటు చేశామన్నారు.

    నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి,  తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి కన్వీనర్లు నాగేశ్వరెడ్డి, రఘునాథరెడ్డి, శరభారెడ్డి, బొంబాయి రమేష్ నాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, యాడికి, పెద్దవడుగూరు జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, చిదంబరరెడ్డి, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు సూర్యనారాయణ, మైనారిటీ నాయకులు మున్నా, జబ్బార్, నియోజకవర్గ యూత్‌ అ«ధ్యక్షుడు బాణా నాగేశ్వరరెడ్డి, నాయకులు రవీంద్రారెడ్డి, మధురాజు, పాశం రంగస్వామి యాదవ్‌ ప్రసగించారు. పార్టీ స్టీరింగ్‌ కమిటీ జిల్లా సభ్యులు వేమనాథరెడ్డి, నాగిరెడ్డి, బాలరాజు,  జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా యూత్‌ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు ఆలూరి రామచంద్రారెడ్డి, ఎంఏ రంగారెడ్డి,  మాజీ మండలాధ్యక్షుడు సుంకిరెడ్డి, పట్టణ కన్వీనర్‌ కంచెం రామ్మోహన్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

    అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి

    జేసీ సోదరుల అరాచకాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మాట వినని వారిని మట్టుబెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. వారు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలా లబ్ధి పొందిన జేసీ సోదరులు.. ఇప్పుడు  వైఎస్‌ విజయమ్మను దూషిస్తున్నారు. తాడిపత్రి పట్టణాభివృద్ధి పేరిట గ్రానైట్‌ యాజమాన్యాల నుంచి బలవంతంగా కప్పం డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడి పరిశ్రమల వల్ల జేసీ సోదరులు మాత్రమే అభివృద్ధి చెందారు. నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అన్యాయం జరిగితే సహించేదిలేదు. వారికి  అండగా ఉంటాం. జేసీ కుటుంబం అరాచకాల వల్ల నష్టపోయిన వారిలో నేనూ ఉన్నా. వారికి అడ్డుకట్ట వేయాలంటే నియోజకర్గంలోని నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి.

    - కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, తాడిపత్రి

     

    రైతులను పట్టించుకోని బాబు

    ముఖ్యమంత్రి చంద్రబాబు జేబు నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు రైతుల సమస్యలు పట్టడం లేదు. అధికార పార్టీ నేతలు ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టి.. అడ్డదారిలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారు. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే  లేదు.

    - శంకర్‌నారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

     

    కుటిల రాజకీయాలు తిప్పికొట్టండి

    శ్రీకృష్ణదేవరాయలు మాదిరిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి జనరంజక పాలన సాగించారు. చంద్రబాబు పాలన మాత్రం ప్రజాధనం దండుకోవడమే ధ్యేయంగా సాగుతోంది. ఈ ప్రభుత్వంలో నిరుపేదలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు జేసీ సోదరులు ఎంతకైనా దిగజారుతారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి కుటిల రాజకీయాలను తిప్పి కొట్టాలి.

    వై.శివరామిరెడ్డి,  ప్లీనరీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement