విశిష్ట అతిథిగా హాస్యనటుడు అలీ
రాజమహేంద్రవరం కల్చరల్ : నవరస నటసమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో గాయకుడు, నటుడు శ్రీపాద జిత్‌మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్టు సమాఖ్య గౌరవాధ్యక్షుడు పట్టపగలు వెంకటరావు తెలిపారు. శుక్రవారం ఆనం రోటరీహాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
సుమారు 210 సినిమాల్లో నటుడిగా, 65 ఏళ్లుగా గాయకుడిగా,న్యాయవాదిగా, క్రీడాకారుడిగా జిత్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేస్తున్నామన్నారు. జిత్ మోహన్ మిత్రా నగరంలో ఆర్కెస్ట్రా స్థాపించి, 47 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఆరువేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారన్నారు. అనంతరం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో భాగంగా జిత్ తన ఆర్కెస్ట్రా ద్వారా సంగీత విభావరి నిర్వహిస్తారని, కుమారి షైలికపాత్రో కూచిపూడి నృత్యం ప్రదర్శిస్తారన్నారు. విశిష్ట అతిథిగా సినీనటుడు అలీ హాజరవుతారన్నారు. సమావేశంలో జిత్, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, పీపీఎస్ కృష్ణారావు, శివప్రసాద్, జగపతి పాల్గొన్నారు.