నైపుణ్యత ఉంటే అవకాశాలు మెండు
-
ఏపీ ఎస్‌ఎస్‌డీసీ మేనేజర్ లోకనాధం
వెంకటాచలం : విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యత ప్రదర్శిస్తే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) మేనేజర్ లోకనాధం తెలియజేశారు. సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ(ఐటీడీఏ), ఏపీఎస్‌ఎస్‌డీసీ, డీఆర్‌డీఏ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటాచలంలోని వైటీసీ కేంద్రంలో జాబ్ మేళా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈజాబ్ మేళాకు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల నుంచి 235 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ఈ మేళాలో ఏడు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై 135 మందిని ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ ఎస్‌ఎస్‌డీసీ మేనేజర్ లోకనాధం మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చున్నారు. ప్రస్తుతం అవకాశాలు రానివారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. పట్టుదల ఉంటే మంచి భవిష్యత్ ఉందన్నారు. అవకాశాలు పొందిన విద్యార్థులు ఆయా రంగాల్లో నైపుణ్యతను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏపీవో శరత్, వైటీసీ కేంద్రం మేనేజర్ బాలాజీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ డీఐటీఓ భాగ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.