
విద్యార్థి మరణం.. కట్టలు తెగిన ఆగ్రహం
- జాతీయ రహదారిపై విద్యార్థుల బైఠాయింపు
- రాస్తారోకోలో పాల్గొన్న వివేకా, ఆకేపాటి
రాజంపేట: జాతీయ స్థాయిలో రాణించిన జూడో క్రీడాకారుడు యుగంధర్ (21) దుర్మరణంతో తోటి విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా ఐదు గంటలకు పైగా కడప–రేణిగుంట జాతీయ రహదారిని దిగ్బంధించేశారు. రోడ్డుపై వేలాది మంది విద్యార్థులు బైఠాయించారు. ఫలితంగా జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
ప్రమాదం ఇలా..
కడప–రేణిగుంట జాతీయ రహదారిపై బోయనపల్లెలోని ఇసుకపల్లె క్రాస్ రోడ్డు వద్ద శనివారం అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతూ జాతీయ స్థాయిలో జూడో క్రీడాకారుడుగా రాణిస్తున్న బి.యుగంధర్ (21) రోడ్డు దాటుతుండగా కడప నుంచి తిరుపతికి వెళుతున్న నాన్‌స్టాప్ బస్సు ఢీకొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థికి అంబులెన్స్ సిబ్బంది చికిత్స అందిస్తుండగానే మృత్యు ఒడికి చేరుకున్నాడు. సకాలంలో పోలీసులు, అంబులెన్స్ రాలేదని ఆగ్రహంతో విద్యార్థులు అంబులెన్స్, ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు.
ఆందోళనలో వివేకా, ఆకేపాటి
విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సంఘీభావంగా రాస్తారోకోలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణతోపాటు పోలీసు, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా యల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ విద్యార్థులను శాంతింపచేయడానికి ప్రయత్నించారు. ఆందోళనలో పట్టణ బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్, నందలూరు సౌమిత్రి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి పల్లె గ్రీష్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేయాలని పట్టు
సంఘటన స్థలానికి సాయంత్రం రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం, డీఎస్పీ రాజేంద్ర చేరుకుని విద్యార్థులతో చర్చించారు. విద్యార్ధులను ఎన్నివిధాగాలు నచ్చచెప్పిన వినేపరిస్ధితులు దాటిపోయాయి. కలెక్టరు రావాలంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు బై
ఠాయించారు. బస్సు డ్రైవరు, అంబులెన్స్ వాహన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి కూడా రాజంపేటకు చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.
డిమాండ్లను అంగీకరించాకే ఆందోళన విరమణ
మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, బోయనపల్లెలో పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని, స్పీడ్ బ్రేకర్లు వేయాలని, ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆర్డీవోను కోరారు. ఆర్డీవో హామీతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు.