భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం
– జేసీ హరికిరణ్
మంత్రాలయం రూరల్: 167వ జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన బాధిత రైతులకు న్యాయం చేస్తామని జేసీ హరికిరణ్ అన్నారు. శుక్రవారం భూముల పరిశీలన నిమిత్తం ఆయన మంత్రాలయం వచ్చారు. ముందుగా గ్రామ శివారులోని 131, 280 సర్వే నెంబర్లు 1.08 ఎకరాలు భూమిని ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ మార్కెట్ రేటు ఎంత ఉందని అడిగారు. ఇందుకు రైతులు జేసీతో మాట్లాడుతూ సెంటు రూ. 2 లక్షలు ఉందని వివరించారు. ప్రభుత్వ ధరల ప్రకారం సెంటు రూ. 45 వేలు చొప్పున పరిహరం అందజేస్తామంటున్నారని, ఇలాగైతే తాము నష్టపోతామని మొర పెట్టుకున్నారు. వీలెనంత వరకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడి నుంచి చెట్నేహళ్లి గ్రామ సరిహద్దులోని సర్వే నెంబరు 174లో 12 సెంట్లు విస్తీర్ణం గల భూమిని పరిశీలించేందుకు వెళ్లగా భూమి తగాదా కోర్టులో ఉన్నందున సంబంధిత రైతులు రాలేదు. రాష్ట్ర సరిహద్దులోని మాధవరం వంతెనను పరిశీలించారు. మంత్రాలయం ఎస్‌ఐ శ్రీనివాసనాయక్‌తో జేసీ మాట్లాడుతూ ఈ ఏడాదికి సంబధించిన క్రై మ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట తహసీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, సర్వేయర్ జ్ఞానప్రకాష్, వీఆర్వోలు శ్వేత, జనార్దన్‌రావు, హైవే అధికారులు ఉన్నారు.