
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని
మచిలీపట్నం : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. టీడీపీ నేతలు కొల్లేరులో మరోసారి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు. కొల్లేరు నిషేధిత ప్రాంతమైన ఆటపాక - కోమటిలంక మధ్య శుక్రవారం రాత్రికి రాత్రే రోడ్డు రోడ్డు వేసేందుకు వారు ప్రయత్నించారు. ఆ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయితే వారిపై చింతమనేనితోపాటు ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ...అవసరం అయితే తనపై కేసు పెట్టుకో అంటూ బెదిరింపులకు దిగి రోడ్డు నిర్మించారు. దాంతో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ ఈశ్వరరావు గతరాత్రి కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే చింతమనేనితోపాటు 60మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో రోడ్డు వేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే అప్పుడు అటవీ శాఖ అధికారులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సదరు ప్రాంతంలో పక్షుల కేంద్రం ఉందని... ఈ నేపథ్యంలో రోడ్డు వేయవద్దంటూ అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ కృష్ణాజిల్లాలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ముసునూరు మహిళా ఎమ్మార్వో డి. వనజాక్షిపై దాడి చేశారు. దీంతో ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.