వైద్యం చేయలేని శిబిరం ఎందుకు
Published Thu, Sep 8 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
కాకరపర్రు (పెరవలి): గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నా.. వైద్యం సక్రమంగా అందించడం లేదని, దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నాం అంటూ కాకరపర్రు గ్రామస్తులు అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే వైద్య శిబిరంలో రెండు మందు బిళ్లలు మాత్రమే ఇస్తున్నారని, కనీసం ఇంజెక్షన్ కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. కాకరపర్రు గ్రామంలో జ్వరాల పరిస్థితిని తెలుసుకునేందుకు బుధవారం పెరవలి తహసీల్దార్ వి.జితేంద్ర ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయన్ను కలిసి ఆవేదన వెళ్లగక్కారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నా ఉపయోగం ఉండటం లేదని అన్నారు. గ్రామంలో సగానికి పైగా జ్వరపీడితులు ఉన్నారని, వందలాది మంది మంచాలపై అవస్థలు పడుతున్నారన్నారు. గ్రామంలో సరైన రోడ్లు, డ్రెయిన్లు లేకపోవడంతో దోమలు వృద్ధి చెంది జ్వరాల బారిన పడుతున్నామని వాపోయారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని, గ్రామంలో చెత్తాచెదారం తొలగించి దోమల నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మందుల కోసం ఆర్డీవోతో మాట్లాడతానని, రోగుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. అనంతరం గ్రామంలో పలువురు రోగులను పరామర్శించారు. బుధవారం కూడా గ్రామంలో సర్వే చేయగా మరో 14 మందికి జ్వరాలు సోకాయని, దీంతో జ్వరపీడితుల సంఖ్య 68కు చేరిందని డాక్టర్ కె.లావణ్య చెప్పారు.
Advertisement