‘కల్లూరు’ ఖరారు! | kalluru declared | Sakshi
Sakshi News home page

‘కల్లూరు’ ఖరారు!

Published Sun, Sep 11 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

‘కల్లూరు’ ఖరారు!

‘కల్లూరు’ ఖరారు!

 రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా దాదాపు ఖాయం
 అధికారికంగా ప్రకటించటమే తరువాయి..
 పది మండలాలతో ప్రతిపాదనలు
 
సత్తుపల్లి/కల్లూరు : కల్లూరు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.. అంటున్నారు. వైరా రెవెన్యూ డివిజన్‌ కేంద్రమనే ప్రకటనతో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కల్లూరు లేదా సత్తుపల్లిని రెవెన్యూ డివిజన్‌ కేంద్రం చేయాలనే డిమాండ్‌ ఊపందుకుంది. నియోజకవర్గంలో ప్రాబల్యం ఉన్న రాజకీయనాయకులు ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలూ వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరకు పంచాయితీ వెళ్లడంతో చివరకు కల్లూరును రెవెన్యూ డివిజన్‌ కేంద్రం చేస్తున్నట్టు సమాచారం.
 
 
సత్తుపల్లి/కల్లూరు :
కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టేనని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ప్రభుత్వంలో నిర్ణయం జరిగిపోయిందని.. అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని తెలిసింది. వైరా రెవెన్యూ డివిజన్‌ ప్రకటన వెలువడగానే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. సత్తుపల్లి లేదా కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తారని భావించారు. అకస్మాత్తుగా వైరా తెరపైకి రావటం రాజకీయవర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల ప్రజల నుంచి బలంగా డిమాండ్‌ వినిపించింది. అధికార, ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలిచాయి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కల్లూరు రెవెన్యూ డివిజన్‌ సాధించేందుకు అండగా నిలిచాయి. సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు అత్యవసర మండల సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపించారు. కల్లూరు మండలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. కలెక్టర్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ప్రతి ఒక్కర్నీ అఖిలపక్షం బృందం కలిసి సమస్యను వివరించింది. కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలంటూ ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు, వినతులను పంపించారు.
పంచాయితీ ముఖ్యమంత్రి వద్దకు.. 
కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలంటూ ఈ ప్రాంత ప్రజలు రెండు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి ఒప్పించినట్టు సమాచారం. కల్లూరు రెవెన్యూ డివిజన్‌ అన్ని మండలాలకు కేంద్రంగా ఉంటుందని.. ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు స్థల సేకరణ కూడా పూర్తయిందని వివరించినట్లు తెలిసింది. వైరా రెవెన్యూ డివిజన్‌ ఖమ్మానికి కేవలం 20 కిలోమీటర్ల దూరమే ఉందని.. వైరా రెవెన్యూ డివిజన్‌ కేంద్రం కావాలంటూ ఎన్నడూ కనీస ప్రతిపాదన కూడా లేదని వివరించినట్లు సమాచారం. 
పది మండలాలతో..
సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, మధిర, ఎర్రుపాలెం మండలాలతో కలిపి కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు రెవెన్యూ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. ఇప్పటికే అధికార వర్గాలలో కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై ఒక స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement