కమనీయం.. ఖాద్రీశుని బ్రహ్మోత్సవం
-
సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై ఊరేగిన నృసింహుడు
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి మంగళవారం పగలు సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై ఊరేగుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలనీ, ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ శ్రీవారు సూర్య, చంద్ర ప్రభలనధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగివుండి వాటినే వాహనాలుగా మార్చుకొని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో దర్శనమిచ్చారు. కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న కొక్కంటి వాసులు స్వామివారికి కాలినడకన జ్యోతిని తీసుకొచ్చారు. వారికి ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. సూర్య, చంద్రప్రభ వాహన ఉభయదారులుగా అంబే శ్రీరామమూర్తి, చిత్తూరుకు చెందిన అంబే రామచంద్ర కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు