ఒక నిమిషం – ఒక విశేషం
పెళ్లి మంత్రాలు
పెళ్లి మంత్రాలకు అర్థాలను తెలుసుకోబోయేముందు పెళ్లి శుభలేఖలపై ఉండే శ్లోకాలకు అర్థాన్ని తెలుసుకుందాం.సాధారణంగా నూటికి తొంభై పెళ్లి శుభలేఖలలోజానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాన్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాస్రస్తా శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్ర నీలాయితాముక్తాస్తాం శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాఃఅనే ఉంటుంది. ఇది ఆదర్శదంపతులైన సీతారాముల కల్యాణంలోని తలంబ్రాల ఘట్టంలోని శ్లోకం.జానకీ దేవి చేతిలోనున్న ముత్యాల తలంబ్రాలు ఆమె మేనికాంతిని ప్రతిబింబిస్తూ, పద్మరాగాల్లా మెరుస్తున్నాయట... రాముడి తలమీద పడేటప్పుడు మల్లెపూలల్లా ఉన్న ఆ తలంబ్రాలు, ఆయన వంటిరంగుతో ఇంద్రనీలాల్లా మారాయట. ఒకటి కానున్న ఈ జంటకు సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలూ చేకూరుగాక అని ఈ శ్లోకానికి అర్థం.
ఫిబ్రవరి 3, శుక్రవారం రథసప్తమి
ప్రత్యక్ష నారాయణుడి పుట్టినరోజు
సూర్యుడిని మిత్రుడు అంటాం. ఆయన ప్రపంచానికే మిత్రుడు. అందరినీ సమదృష్టితో చూస్తాడు. కులమత భేదాలు, జాతి వివక్ష, తెలుగునలుపులనే వర్ణభేదం లేని వాడు సూర్యుడు. అందుకే ఆయనకు నిత్యం నమస్కరించాలి. ఆ నమస్కారాన్నే ‘సూర్య నమస్కారాలు’గా పన్నెండు నామాలతో స్మరిస్తూ చేయాలని పెద్దలు నిశ్చయించారు. సూర్యనమస్కారాల వల్ల, సూర్యశక్తి శరీరంలోకి నేరుగా ప్రవేశిస్తుంది. అందువల్ల ఊహించని మార్పులు జరుగుతాయి. అంతటి శక్తిమంతుడు సూర్యుడు. మనం అనుభూతి చెందే వెలుగు, వేడిమిలను ఆయనే ప్రసాదిస్తున్నాడు. అందుకే ఆయనను ప్రత్యక్ష దైవమయ్యాడు సూర్యుడు మాఘశుద్ధ సప్తమి నాడు జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. సూర్యుని జన్మదినాన్ని అందరం జరుపుకోవలసిందే. కర్మసాక్షిని స్మరించవలసిందే! నమస్కరించవలసిందే!
ఏ దేవుడికి ఏ పూలు?
అభిషేకప్రియుడిగా శివుడికి పేరున్నప్పటికీ, జిల్లేడు, గన్నేరు, లింగమల్లె, ఉమ్మెత్త, జమ్మి, తుమ్మి, నల్లకలువ పూలతో పూజించడం వల్ల ఆయన ప్రసన్నుడవుతాడని ప్రతీతి. మారేడు దళాలతో పూజిస్తే కోరికలు తీరతాయి. దారిద్య్రం తొలగిపోతుంది. నల్లకలువ పూలదండ సమర్పించడం వల్ల ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈశ్వరుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించడం వల్ల గోదాన ఫలం లభిస్తుందట. మందార, ఉత్తరేణి, జాజి, సంపెంగ, మల్లె, గున్నమామిడి కూడా పరమేశ్వరునికి ప్రీతికరమైనవే. కడిమిపూలు, ఉమ్మెత్తపూలు, కడిమి పూలు రాత్రి సమయంలో సమర్పించాలి. మంకెన, బొడ్డుమల్లె, వెలగ, పొగడ, దిరిసెన, వేప పువ్వులను, బిల్వపత్రాలను శివునికి అభిముఖంగా వెల్లకిలా అర్పించి అలంకరించాలని శాస్త్ర వచనం.
లింబాద్రిలో... కోరమీసాల
నరసింహుడు
దేశంలో బదరికాశ్రమం తరువాత నరనారాయణులు కొలువైన అరుదైన క్షేత్రం లింబాద్రిగుట్ట. దక్షిణ బదరీగా పేరొందిన ఈ గుట్టపైన వాయుదేవుడు, ఇంద్రుడు, యముడు, ప్రహ్లాదుడు తదితరులు తపస్సు చేసినట్లు స్థలపురాణం. కోరమీసాలతో, ఆదిలక్ష్మీసమేతుడై, పరమశాంతంగా కనిపించే ఈ స్వామి కోరిన వెంటనే కోరికలు తీర్చే కోరమీసాల నరసింహుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ప్రాంతంలో వేపచెట్లు అధికంగా ఉండటం వల్ల నింబాచలమని, నింబాద్రి అనీ పిలిచేవారు. కాలక్రమేణా అదే లింబాద్రిగా మారింది. ఎలా వెళ్లాలంటే..? నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వచ్చి, అక్కడినుంచి భీమగల్కు చేరుకోవాలి.