కామినేని శ్రీనివాస్
మంత్రి కామినేని శ్రీనివాస్ కీళ్ల మార్పిడి ఆపరేషన్ తీరిది
కార్పొరేట్ వైద్యులతో శస్త్రచికిత్స
ఆపరేషన్ అయ్యాక వైద్య పరికరాలు మాయం
మండిపడుతున్న వైద్యులు, రోగులు
‘జీజీహెచ్‌పై నమ్మకం కలిగించేందుకే మంత్రిఆపరేషన్ ఇక్కడ చేయించుకున్నారట. అయితే, ఆయనకు జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదు. అందుకే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వైద్యులను పిలిపించుకుని మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య పరికరాలు సైతం కార్పొరేట్ వైద్యశాలల నుంచి తెప్పించుకుని ఆపరేషన్ అయిపోగానే తిరిగి పంపించేశారు. ఆర్ధోపెడిక్ విభాగంలో ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధం చేయకుండా గుండె జబ్బుల విభాగంలోని సీటీఎస్ శస్త్రచికిత్స విభాగంలో మంత్రికి ఆపరేషన్ నిర్వహించారు.’ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కీళ్లమార్పిడి శస్త్రచికిత్స అనంతరం శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో వినిపించిన గుసగుసలివీ..
గుంటూరు : గత ఏడాది జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో ఓ పసికందు ఎలుకల దాడిలో మృతిచెందిన సంఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇక్కడి వైద్యుల పనితీరు మెరుగుపరిచి, కనీసం వైద్య పరికరాలు, వసతులు కల్పించి జీజీహెచ్‌కు వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాత్రి నిద్రలు, ఆసుపత్రిలో స్వయంగా శస్త్రచికిత్స చేయించుకోవడం వంటి వాటితో ప్రజల్లో నమ్మకం కలిగిస్తానంటూ ప్రకటనలు చేశారు.
అయితే, శుక్రవారం మంత్రి కామినేని కుడికాలుకు జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ ఆపరేషన్‌ను కేర్ ఆస్పత్రి వైద్యుడు బీఎన్ ప్రసాద్, గుంటూరు సాయిభాస్కర్ ఆసుపత్రి వైద్యుడు బూసిరెడ్డి నరేంద్రరెడ్డి నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మంత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారో అది తీవ్ర విమర్శల పాలవుతోంది.
మంత్రి మెప్పు కోసమే..
మంత్రికి ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసి జీజీహెచ్‌కు కీళ్ల మార్పిడి ఆపరేషన్ కోసం ఎవరైనా వస్తే చేసేందుకు వైద్యులు లేరు. ఆపరేషన్ థియేటర్ లేదు. వైద్య పరికరాలు, సరైన వసతులు ఇక్కడ కనిపించవు. కానీ, మంత్రిగారి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి సున్నాలు, మరమ్మతులు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా ఐసీయూ బెడ్ కొనుగోలు చేశారు. ప్రైవేటు వైద్యశాలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద వేలకొద్దీ కీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నప్పటికీ జీజీహెచ్‌లో ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు కనీస ప్రయత్నం జరగకపోవడం శోచనీయం.
అంతా ఆర్భాటమే..
2002లోనే జీజీహెచ్‌లో అప్పటి వైద్యులు మోకాళ్లచిప్ప మార్పిడి ఆపరేషన్ కంటే కష్టమైన తొంటి మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పద్నాలుగేళ్లుగా ఆపరేషన్లు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు సరైన వైద్య సేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రే ఆర్భాటాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై జీజీహెచ్ వైద్యులు, ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ఆపరేషన్ చేయించుకున్న తీరు చూస్తుంటే ఆసుపత్రి కేవలం గదులు అద్దెకు ఇచ్చేందుకు మాత్రమే పనికొస్తుందనే అపోహ కలుగుతోందని వైద్య నిపుణులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.