భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శం
విజయవాడ కల్చరల్ : భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శమని కంచికామకోటి పీఠ ఉత్తరాధికారి శంకర విజయేంద్రసరస్వతీస్వామి పేర్కొన్నారు. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి స్వాములకు లబ్బీపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం పాలక మండలి చైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సత్కార సభను నిర్వహించారు. విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ ప్రపంచానికి విశ్వగురువులను అందించిన ఘనత భారతదేశానికే దక్కుతుందని చెప్పారు. జయేంద్ర సరస్వతి నిర్వహణలో సమాజసేవలో భాగంగా విద్యాలయాలు, ఆస్పత్రులు, వేదపాఠశాలలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో నవంబర్ 13వ తేదీ ప్రభుత్వం మఠానికి కేటాయించిన స్థలంలో వేద పాఠశాల, నేత్రాలయం, ధార్మిక కార్యక్రమాల కోసం కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేరోజు కెనాల్ రోడ్డులోని వినాయక దేవాలయంలో మహాకుంభాభిషేకం ఉంటుందని వివరించారు. జయేంద్ర సరస్వతి మాట్లాడుతూ నగర ప్రజలు ధార్మిక కార్యక్రమాల్లో ముందుంటారని, నదులున్న చోట వేదాలు జీవం పోసుకుంటాయని వివరించారు. దేవాలయ పాలక మండలి చైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యాన్ని ఆచార్య సేవారత్న బిరుదుతో సన్మానించారు. దేవాలయ పాలక మండలి చైర్మన్ కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీస్వామి, శంకర విజయేంద్ర సరస్వతీస్వామిని సత్కరించారు. కార్యక్రమంలో జనచైతన్య రియల్ ఎస్టేట్ ఎండీ మాదాల సుధాకర్, ముత్తవరపు మురళీకృష్ణ, మాజీ మేయర్ జంధ్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.