మేమేమైనా ఉగ్రవాదులమా ?
పోలీసుల తీరుపై కాపు జేఏసీ నేతల ఆగ్రహం
ఉక్కుపాదంతో అణచివేతకు పోలీసుల కుట్ర
కిర్లంపూడి(జగ్గంపేట) : రాష్ట్రంలో కాపుజాతిని అణచి వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, గౌతు స్వామి, పసుపులేటి ఉషాకిరణ్, నల్లకట్ల పవన్‌కుమార్‌లు అన్నారు. ఆదివారం కిర్లంపూడిలో ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపు కాపులను బీసీల్లో కలుపుతానని, ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి కాపుల అభివృద్ధికి కట్టుబడతానని, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పి అధికారం చేపట్టి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం హామీల అమలుకు ఉద్యమం చేపట్టారన్నారు. ఉద్యమం చేపట్టి రెండేళ్లు దాటినా కాపులకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రికి గుర్తు చేయడం కోసం శాంతియుతంగా గాంధేయ మార్గంలో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కిర్లంపూడి నుండి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర నిర్వహించ తలపెట్టారన్నారు. 26 కు ముందే వేలాది మంది పోలీసులను మోహరింపజేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ పికెట్‌లను ఏర్పాటు చేసి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను భయభ్రాంతులకు గురి చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ముద్రగడ పాదయాత్రపై విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరు చూస్తుంటే మేమేమన్నా నక్సలైట్లమా, తీవ్రవాదులమా అని ప్రశ్నించారు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు రిజర్వేషన్‌లు, స్పష్టమైన వైఖరిని ప్రకటించండాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో విషయాలపై కమిషన్‌లు వేశారు, మూడు, నాలుగు నెలల్లో కమిషన్ రిపోర్టులు ఆయా ప్రభుత్వాలు తెప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రెండేళ్లు దాటినా కమిషన్ రిపోర్టు తెప్పించుకోకుండా కాలయాపన చేయడం కాపులను మోసం చేయడమేనన్నారు. ఇచ్చిన హామీలను అడుగుతుంటే నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందన్నారు. ఇదే ధోరణి అవలంబిస్తే భవిష్యత్తులో జాతి తిరగబడటానికి సిద్ధంగా ఉందన్నారు. 1994లో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపుల మీద జరిగిన దౌర్జన్యానికి నిసనగా సొంత పార్టీ మీదే తిరుగుబాటు చేసి జాతి కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జీఓ నంబర్ 30ని సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ముద్రగడను విమర్శించే అర్హత ఏ ఒక్కరికీ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోతే ముద్రగడ సారథ్యంలో కిర్లంపూడి నుండి అమరావతి వరకు పాదయాత్ర చేసి తీరుతామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు బిఎన్ మూర్తి, పసుపులేటి మురళి, దోమాల బాబు, ఏసురెడ్డి పాపారావు, ఎస్సీ నాయకులు పల్లె హరిశ్చంద్రప్రసాద్, ఎస్‌కే ఇబ్రహీం, చల్లా సత్యనారాయణ, అన్నెం సత్తిబాబు, అడబాల శ్రీను, మండపాక చలపతి తదితరులు పాల్గొన్నారు.
ముద్రగడ పాదయాత్రకు వెళితే కేసులా
తునిలో 100 మందికి నోటీసులు
తుని : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత కేసులను తెరపైకి తీసుకువచ్చి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెల 26న ముద్రగడ నిర్వహించనున్న పాదయాత్రలో పాల్గొనవద్దని పోలీసులు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. తుని నియోజకవర్గం పరిధిలో ఆదివారం నాటికి 30 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయగా, 70 మందికి నోటీసులు ఇచ్చారు. కాపు జేఏసీ మాత్రం నోటీసులకు భయపడేది లేదని చెబుతున్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తుందని కాపులు విమర్శిస్తున్నారు. ఎంతమందిని జైలులో పెట్టినా పాదయాత్రకు కాపులు తరలి వెళతారని జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
ఎందుకంత అతి ?
పోలీసుల ఓవరాక‌్షన్‌పై వైఎస్సార్ సీపీ విశాఖ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ మండిపాటు
జగ్గంపేట : చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీని అమలు చేయమని ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టదలచడంతో ఆయనను నిలువరించేందుకు ప్రభుత్వం పోలీసులతో అవసరానికి మించి ఓవరాక‌్షన్ చేయిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ పట్టణ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ అన్నారు. ముద్రగడను కలిసి మద్దతు తెలిపేందుకు ఆదివారం ఆమె కిర్లంపూడి వచ్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడకు కలవడానికి వస్తే నక్సలైట్, మావోయిస్టు, సంఘ విద్రోహ శక్తులను చూసేందుకు వస్తున్నట్టు దారిలో నాలుగు చోట్ల వాహనం ఆపి కిందకు దించి ఫొటోలు తీసుకున్నారని ఇది ఎంతవరకు సమంజసం మన్నారు. ఇన్ని అడ్డంకులు దేనికని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా గట్టి బందోబస్తుతో ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమెతో పాటు పసుపులేటి మురళీకృష్ణ, మనోజ్ తదితరులు ఉన్నారు.