తాడో పేడో తేల్చుకుంటాం
తాడో పేడో తేల్చుకుంటాం
Published Thu, May 4 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM
కాపులకు బీసీ రిజర్వేషన్లపై ఉద్యమిస్తాం
7న కాకినాడలో రాష్ట్రస్థాయి జేఏసీ సమావేశం
జిల్లా కాపు జేఏసీ కన్వీనర్
కాకినాడ రూరల్ కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంపై ప్రభుత్వంతో తాడో డో తేల్చుకుంటామని జిల్లా కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గురువారం కాకినాడ రూరల్ రమణయ్యపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ వీవై దాసు మాటట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు అడుగుతున్న తమ నేత ముద్రగడ పద్మనాభంపై ప్రజాప్రతినిధులు, మంత్రులతో సీఎం చంద్రబాబు దాడి చేయిస్తున్నారన్నారు. మంత్రి పదవులను కాపాడుకోవడం కోసం కాపుల ఆత్మ గౌరవాన్ని సీఎం చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం ప్రోద్బలంతో ఉద్యమంపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఏడాదికి కాపులకు రూ.1,000 కోట్లు రుణాలు ఇస్తామని చెప్పి, మూడేళ్ల పదవీ కాలంలో కేవలం రూ. 320 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాలో 3.30 లక్షల మంది కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. కాపులు సామాజిక, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను 1.10 లక్షల మంది సంతకాలు, ఆధార్ కార్డుల జిరాక్స్‌తో మంజునాథ కమిటీకి అందజేశామన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతుంటే పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు దాటకూడదని ప్రభుత్వం చెబుతోందని, ఇది ఎంతమాత్రం నిజం కాదని జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ తెలిపారు. దేశంలోని కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 65 నుంచి 70 శాతానికి పైగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 80 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. జిల్లాకు చెందిన దేశంలో ఎన్నడు లేని రీతిలో జిల్లాలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అత్యవసర పరిస్థితిని పోలీసులతో విధించారని ఆరోపించారు. గత ఏడాది నవంబర్ నుంచి నేటి దాకా సెక‌్షన్ 30 అమలు చేసిన ఘనత హోం మంత్రికే దక్కిందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ప్రజా సమస్యలు పరిష్కారం ముఖ్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎంకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. గ్రామాల్లోకి ఏముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారో అప్పుడే కాపుజాతి ప్రజా ప్రతినిధులను నిలదీస్తారన్నారు. కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈ నెల 7న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు రాష్ట్రస్థాయి జేఏసీ సర్వసభ్యుల సమావేశాన్ని కాకినాడ పద్మనాభ ఫంక‌్షన్ హాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశానికి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు నల్లా విష్ణుమూర్తి, కె.తాతాజీ, బి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement