ముద్రగడ దీక్షకు పెరుగుతున్న మద్దతు
కిర్లంపూడి: కాపుల రిజర్వేషన్ల సాధన కోసం కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో ముద్రగడ దీక్షకు టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. ఈ దీక్షకు సంఘీభావంగా 1500 మంది టీడీపీకి రాజీనామా చేశారు. ముద్రగడ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరతామంటూ టీడీపీకి రాజీనామా చేసిన నేతలు పేర్కొన్నారు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కాపు నేతలు, అనుచరులు ఆందోళనను ఉధృతం చేశారు. ఆమరణ దీక్షకు మద్ధతుగా జిల్లా వ్యాప్తంగా కాపు నేతలు ఆమరణ దీక్షలకు దిగడానికి సిద్ధమని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపునేతలు ముద్రగడ దీక్షకు మద్ధతుగా ప్లేట్లను గరిటెలతో కొడుతూ నిరసనలు తెలుపుతున్నారు.
ముద్రగడ దంపతులు వైద్య పరీక్షలకు నిరాకరించడంతో వైద్యులు వారికి ఆదివారం నాడు హెల్త్ చెక్ అప్ నిర్వహించలేదు. జేసీ సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాశ్ ముద్రగడ ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించారు. వైద్యపరీక్షల కోసం ఒత్తిడి తెచ్చినప్పటికీ కాపునేత ముద్రగడ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రకాశం జిల్లా పర్చూరులో కాపు నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీని చేపట్టారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి కాపు నేతలు ర్యాలీని ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట రెండో రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నేతలు కావటి మనోహర్ నాయుడు, కిలారు రోశయ్య, పార్థసారధి, తదితర నేతలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు.