విచారణ పేరుతో ఒకరికి బదుల మరొకర్ని చితకబాదిన కర్ణాటక పోలీసుల దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- ఒకరికి బదుల మరొకర్ని చితకబాదిన వైనం
- ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన
----------------------------------------------------
గుంతకల్లు : విచారణ పేరుతో ఒకరికి బదుల మరొకర్ని చితకబాదిన కర్ణాటక పోలీసుల దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అనంతపురం జిల్లా గుంతకల్లు శివార్లలోని ఆలూరు రోడ్డు కాల్వగడ్డ ఏరియాలో నివాసముంటున్న షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి తాపీ మేస్త్రీ కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక పాతబస్టాండ్ ఏరియాలోని మెకానిక్ షెడ్డులో బైక్‌ను రిపేరి చేయించుకుంటుండగా అదే సమయంలో టాటాసుమోలో వచ్చిన కర్ణాటక రాష్ట్రం బళ్లారి కౌల్‌బజార్ ఠాణా పోలీసులు ‘అబ్దుల్లా అంటే నువ్వేనా’ అని అడిగారు. ఔనని సమాధానం చెప్పేలోగానే లాఠీలతో చితకబాదేశారు.
‘నన్ను ఎందుకు కొడుతున్నారని’ అతను అడుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఏకంగా అతని చేతికి సంకెళ్లు వేసి తమ వెంట పట్టణ శివార్లలోని బళ్లారి చౌరస్తాలోకి పిల్చుకెళ్లారు. ఆ తరువాత అబ్ధుల్లాను సెల్‌ఫోన్ కెమెరాలో బంధిచి వాట్సప్ ద్వారా బళ్లారి కౌల్‌బజార్ పోలీసుస్టేషన్‌కు నిర్ధరణ కోసం పంపగా... అసలు వ్యక్తి అతను కాదని అక్కడి నుంచి సమాధానం రావడంతో వదిలేశారు. తన వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కొని సిమ్‌కార్డు(నెంబర్: 8341085352) తీసుకువెళ్లారని బాధితుడు ఆరోపించాడు. గుంతకల్లు మండలం నరసాపురం కొట్టాలలో నివాసముంటున్న అబ్ధుల్లా అనే వ్యక్తి(అంత్రాలు వేస్తూ జీవించేవాడు)పై బళ్లారి కౌల్‌బజార్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అతని కోసం వచ్చి తనను తీసుకువెళ్లి చితకబాదారని తాపీ మేస్త్రీ అబ్ధుల్లా బోరుమన్నాడు. తల, వీపు, ముఖంపై బలంగా పిడిగుద్దలు కురిపించారని కన్నీటిపర్యంతమయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై గుంతకల్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు అబ్ధుల్లా విలేకరులకు గురువారం తెలిపారు.