
మేయర్ భర్త కూడా మృతి
చిత్తూరు: చిత్తూరులో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ తమిళనాడు వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో మేయర్ అనూరాధపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూరాధతో పాటు ఉన్న కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో రాత్రి సమయంలో మృతి చెందారు.
మరోవైపు ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ముగ్గురు వ్యక్తులు చిత్తూరు ఒన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోను, మరో వ్యక్తి చిత్తూరు కోర్టులోను లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మోహన్ అక్క కుమారుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూకు చెందిన ఆఫీసును మోహన్ వర్గీయులు పెట్రోలు పోసి నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.