కేసీఆర్‌వి దిగజారుడు రాజకీయాలు | KCR degrading Politics | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌వి దిగజారుడు రాజకీయాలు

Published Sat, Oct 29 2016 3:20 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

కేసీఆర్‌వి దిగజారుడు రాజకీయాలు - Sakshi

కేసీఆర్‌వి దిగజారుడు రాజకీయాలు

గ్రామీణ విద్యార్థి యువ గర్జన సభలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
 
 సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో గద్దె నెక్కి కేసీఆర్ ఆ విద్యార్థుల భవిష్యత్తుతోనే ఆటలాడుకుంటున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థి యువగర్జన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రూ.3,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సర్కారు చెల్లించకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రైతుల రుణమాఫీకి, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం బిల్లులకు, సబ్సిడీ రుణాల పథకానికి నిధులివ్వని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు మాత్రం రూ.20 వేల కోట్ల బిల్లులు కట్టబెట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయనేది అర్థం చేసుకోవాలన్నారు.

 రెండున్నరేళ్ల వైఫల్యాలను ప్రజల్లోకి..
 డిసెంబర్ రెండో వారం నాటికి సర్కారుకు సగం రోజులు పూర్తవుతాయని, ఈ రెండున్నరేళ్ల పాలనలో సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని పీసీసీ చీఫ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్‌గాంధీలతో రాష్ట్రంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. విద్యార్థి, రైతు ఉద్యమాలతో ప్రజల్లోకి వెళతామని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన హోంగార్డులపై పోలీసులు లాఠీచార్జి నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, హోంగార్డుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
 
 ఫీజు రీయింబర్స్‌మెంట్ వైఎస్ ఆలోచనే

 రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న స్కాలర్‌షిప్‌ల విధానంతో నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు సరిపోవని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పాలసీని తీసుకువచ్చారని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అన్నారు. దీంతో నిరుపేద విద్యార్థులకు సైతం వృత్తి, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం దక్కిందన్నారు. అమెరికాలాంటి దేశాల్లో నిరుపేద విద్యార్థులు స్థిరపడ్డారంటే వైఎస్‌ఆర్ రూపకల్పన చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పుణ్యమేనన్నారు.

తెలంగాణలో పాలన ఫ్యూడల్ రాజ్యం ఏర్పాటు దిశగా సాగుతోందని చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధిం చిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వని కేసీఆర్.. తన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు కట్టబెడుతున్నారని ఆరోపిం చారు. కార్యక్రమంలో మండలిలో కాం గ్రెస్ పక్ష ఉపనేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మధుయాష్కిగౌడ్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, నాయకులు జి.గంగాధర్, మహేష్‌కుమార్‌గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement