ప్రభుత్వం మెడలు వంచుతాం: ఉత్తమ్
కామారెడ్డి: ప్రభుత్వం మెడలు వంచైనా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో షబ్బీర్‌అలీ అధ్యక్షతన విద్యార్థి పోరు గర్జనసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకులాల్లోని పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకువచ్చిందని, ఈ పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. సీఎం కేసీఆర్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల పోరాటంతోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు.
‘కేసీఆర్ హటావో’ నినాదంతో ఉద్యమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకు అన్యాయం చేయడంపై ‘సీఎం కేసీఆర్ హటావో’ నినాదంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సభలో ఏఐసీసీ నాయకులు కుంతియా, కొప్పుల రాజు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.