యాదాద్రి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం గజ్వేల్‌లో నిర్వహించిన మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని పిడిచెడ్ రోడ్డులో ఉన్న ఆలయంలో అమ్మవారికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఏర్పాటైన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను వేగిరంగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సైతం రూ.400 కోట్లతో కార్యాచరణ సిద్ధమవుతోందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేయడం వల్లే దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా గుర్తింపు పొందారని చెప్పారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు కేసీఆర్ బాటలో నడవాలని సూచించడం గర్వకారణమన్నారు. అనంతరం ‘హరితహారం’లో భాగంగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మహంకాళి ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు.