రాజమౌళికి కేసీఆర్ ఫోన్
వరంగల్ : హలో.. నేను సీఎం కేసీఆర్‌ను మాట్లాడుతున్నా.. అంటూ గంగదేవిపల్లి మాజీ సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళికి కేసీఆర్ సోమవారం రాత్రి 8 గంటలకు ఫోన్ చేశారు. అయితే సీఎం తనకు ఫోన్ చేసి మాట్లాడుతుండటంతో రాజమౌళి కొంత ఆశ్చర్యానికి గురైనా ఆ తర్వాత తేరుకుని ఆయనతో మాట్లాడారు.
సోమవారం మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇక్కడి పద్ధతులను, ప్రజల ఐకమత్యాన్ని, సంఘటిత శక్తిని తెలుసుకుని హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ రాత్రి 8 గంటలకు నేరుగా రాజమౌళికి ఫోన్ చేసి మాట్లాడారు. తాను గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించడంపై ప్రజల స్పందన ఎలా ఉందని సీఎం కేసీఆర్ రాజమౌళిని అడిగారు. అయితే ‘మీ రాకతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు.
మాలో స్ఫూర్తిని నింపారు. మా గ్రామంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులును ప్రతిభింబించే విధంగా మీ మాటలు ఉన్నాయి. మేం అడిగిన నిధుల కంటే ఎక్కువగా నిధులు మంజూరు చేసినందుకకు మా గ్రామస్తుల ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంది’ అని రాజమౌళి అన్నారు. కాగా ‘ఇప్పటి వరకు మీరు కమిటీల ద్వారా ప్రజలను ఐక్యంగా చేశారు.
ఇంకా ఎంతో చేయాలి. ప్రతీ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. వ్యసాయాన్ని పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో చేయాలి. ఈ విషయంలో ఆలోచించండి. ప్రభుత్వ నుంచి మీకు పూర్తి సహకారం ఉంటుంది.’ అంటూ సీఎం కేసీఆర్ తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు కూసం రాజమౌళి తెలిపారు.